ప్రస్తుత తరుణంలో ఫిట్నెస్ కోసం ప్రతి ఒక్కరూ యత్నిస్తున్నారు. శరీరాన్ని దృఢంగా ఉంచుకునేందుకు అనేక మార్గాలను అనుసరిస్తున్నారు. వ్యాయామం చేయడంతోపాటు ఫిట్‌గా ఉండేందుకు సాంకేతిక పరికరాలను కూడా వాడుతున్నారు. వాటిల్లో స్మార్ట్ వాచ్‌లు, బ్యాండ్లు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ప్రస్తుతం చాలా వరకు కంపెనీలు వీటిని తయారు చేసి విక్రయిస్తున్నాయి. మరి ఏయే ఫీచర్లు ఉన్న వాచ్ లేదా బ్యాండ్ ను కొనుగోలు చేస్తే మంచిది ? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
స్మార్ట్ వాచ్ లేదా బ్యాండ్ దేన్ని కొనుగోలు చేసినా సరే అందులో ఇచ్చే ఫీచర్లను ముందుగా తెలుసుకోవాలి. అవి ఏ విధంగా పనిచేస్తాయో తెలుసుకుని, ధరలను సరిచూసి అప్పుడు వాటిని కొనుగోలు చేయాలి. ఇక ఫీచర్లలో ముఖ్యంగా డిస్ప్లే విషయానికి వస్తే ప్రస్తుతం చాలా వరకు వాచ్‌లు, బ్యాండ్ల డిస్ప్లేలను అమోలెడ్ టైప్‌లో ఇస్తున్నారు. వాటికి గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌ను కూడా అందిస్తున్నారు. కనుక ఈ రెండూ ఉన్న డివైస్‌లను కొనుగోలు చేస్తే మంచిది.
ఇక స్మార్ట్ వాచ్, బ్యాండ్లలో స్పోర్ట్స్ మోడ్స్ ముఖ్యమైనవి. అంటే.. మనం చేసే ప్రతి పనిని ట్రాక్ చేసేందుకు వివిధ రకాల మోడ్స్ ఉంటాయన్నమాట. సైక్లింగ్, జాగింగ్, రన్నింగ్.. ఇలా ఎక్కువ యాక్టివిటీలను సపోర్ట్ చేసే డివైస్ అయితే బెటర్. అలాగే డివైస్‌లో ఆక్సిజన్ లెవల్స్‌ను కొలిచే ఎస్పీవో2 సెన్సార్, గుండె కొట్టుకునే రేటును కొలిచే హార్ట్ రేట్ సెన్సార్ వంటివి కచ్చితంగా ఉండాలి. వీటితో పాటు చక్కని బ్యాటరీని అందివ్వాలి. చాలా వరకు డివైస్ లలో 7 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ లభిస్తుంది. అంతకు తగ్గకుండా బ్యాటరీ లైఫ్‌ను ఇచ్చే డివైస్‌ను ఎంపిక చేసుకోవాలి.
స్మార్ట్ వాచ్, బ్యాండ్లలో ఎన్ఎఫ్సీ, జీపీఎస్, ఎల్టీఈ, వైఫై వంటి ఆప్షన్లు ఉంటే మంచిది. అలాగే ఫోన్ కనెక్టివిటీ ఉండేలా చూసుకోవాలి. దీంతో సౌకర్యవంతంగా ఉంటుంది. ఇలా పైన తెలిపిన ఫీచర్లు కలిగిన బ్యాండ్ లేదా వాచ్‌ను కొంటే వాటిల్లోని అన్ని ఫీచర్లను ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల కంపెనీలు భిన్న రకాల బ్యాండ్లు, వాచ్‌లను అందిస్తున్నాయి. వాటిల్లో పైన తెలిపిన ఫీచర్లు ఉండడంతోపాటు తక్కువ ధరకు వస్తుందో లేదో చెక్ చేయాలి. అలాంటి డివైస్ లను కొంటేనే పెట్టిన డబ్బుకు ఫలితం ఉంటుంది.