మనం ఎక్కడ ఉన్నాం.. మన స్థాయేంటి అని కూడా ఆలోచించకుండా.. కొందరు చేస్తున్న పని కోపం తెప్పిస్తుంది. అలాంటి ఘటనే ఇది.. దేశ ప్రజల భవిష్యత్తు నిర్ధేశించే చట్ట సభలో ఓ ఎంపీ పాడుపని చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. బ్రిటన్ సీనియర్ మంత్రి పార్లమెంట్ సమావేశాల్లో మొబైల్ ఫోన్లో పోర్నోగ్రఫీ వీడియోలు చూస్తున్నట్టు ఆరోపణలు రావడం సంచలం సృష్టిస్తోంది. పార్లమెంట్ దిగువ సభలో (హౌస్ ఆఫ్ కామన్స్)లో గత కొన్ని నెలలుగా మహిళా సభ్యురాలి వెనుక కూర్చున్న ఓ సీనియర్ మంత్రి పోర్న్ వీడియోలు చూస్తున్నారని బ్రిటన్ పత్రిక డెయిలీ మెయిల్ ఓ కథనం ప్రచురించింది. దీంతో అధికార కన్జర్వేటివ్ పార్టీపై మరోసారి ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
ఈ ఘటనపై స్పందించిన కన్జర్వేటివ్ పార్టీ.. విచారణకు ఆదేశించింది. పార్లమెంట్ స్వతంత్ర ఫిర్యాదులు, గ్రీవెన్సు విభాగానికి (ఐసీజీఎస్) కన్జర్వేటివ్ పార్టీ చీఫ్ విప్ క్రిస్ హేటన్-హ్యారిస్ రిఫర్ చేశారు. ఐసీజీఎస్ దర్యాప్తులో ఆరోపణలు రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని హ్యారిస్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇటీవల కాలంలో వెస్ట్‌మినిస్టర్‌లో లైంగిక వేధింపులు, మహిళలపై అనుచిత ప్రవర్తన వంటి ఆరోపణల నేపథ్యంలో దర్యాప్తునకు ఆదేశించింది.