రైతులకు అండగా వైసీపీ ప్రభుత్వం నిలుస్తోందని ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి అన్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నామని తెలిపారు. రైతుల అవసరాలకు తగ్గట్లు, రైతులు ఇష్టపడే పరికరాలనే పంపిణీ చేస్తున్నామన్నారు. వారికి నచ్చిన వ్యవసాయ రంగ యంత్రాలను కొనుగోలు చేసుకోవచ్చని అన్నారు. గతంలో చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ ప్రభుత్వం ట్రాక్టర్ డీలర్లతో కుమ్మక్కై కమీషన్లు తీసుకున్నారని ఆరోపించారు. ట్రాక్టర్ల పంపిణీలో అవినీతి జరిగిందని పేర్కొన్నారు.
గుంటూరు జిల్లా చుట్టగుంట వద్ద వైఎస్సార్ యంత్ర సేవ పథకం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి మెగా మేళా నిర్వహించారు. ఈ మేళాకు సీఎం జగన్ మోహన్ రెడ్డి మంగళవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతు గ్రూపులకు మంజూరైన ట్రాక్టర్లు, కంబైన్డ్ కోత యంత్రాలు పంపిణీ చేశారు. అనంతరం రైతులతో కలిసి ట్రాక్టర్ నడిపి ఉత్సాహపరిచారు. అనంతరం పల్నాడు జిల్లా కొండవీడులో జిందాల్ ప్లాంటు వద్ద ఏర్పాటు చేసిన జగనన్న హరిత నగరాలు నమూనాను ఆవిష్కరించారు. అలాగే వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్‌ను ప్రారంభించారు.