గెలిచి తీరాల్చిందే… అందుకే గెలిచాం

-

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రయివేటీకరణ నేపథ్యంలో ఒక‌వైపు నిరసన సెగలు.. ఉధృత‌మ‌వుతున్న ఉద్య‌మం… మ‌రోవైపు నగరంలోని నాలుగు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలుండ‌టం… పరిపాలనా రాజధానిగా ప్రకటించిన తర్వాత జరిగే ప్రత్యక్ష ఎన్నికలు కావడం ఇంకోవైపు… దీంతో గెలిచి తీరాల్చిన పరిస్థితి.. రాజధాని తరలింపునకు ఇక్కడి ప్రజల ఆమోదం ఉందని తెలియజేయాల్సిన స్థితి.. ఇలా ప‌లు అంశాలను దృష్టిలో పెట్టుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పక్కా వ్యూహంతో పనిచేసింది. విజయం సాధించింది.

ఒక వార్డుకు ఒక ఇన్‌చార్జి

నగరంలోని అన్ని వర్గాలకు చెందినవారితోపాటు, వ్యాపారులతో పార్టీ నేతలు సమావేశాలు నిర్వహించారు. నియోజక వర్గానికి ఒక పరిశీలకుడిని నియమించడంతోపాటు వార్డుల వారీగా ఒక్కో ఇన్చార్జిని నియమించారు. నోటిఫికేషన్ రాకముందే నగరంలోని అన్ని మురికివాడలను సందర్శించి, వారికి హామీల వర్షం కురిపించారు. అదే సమయంలో ఉక్కు కర్మాగారం ప్రయివేటీకరణ అంశం తెరపైకి రావడంతో దాని ప్రభావం జీవీఎంసీ ఎన్నికలపై పడకుండా ఉండేందుకు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పాదయాత్ర నిర్వహించారు.

ప‌రిపాల‌నా రాజ‌ధాని ప్ర‌క‌ట‌నే…

ప్రభుత్వ సంక్షేమ పథకాలు, విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించడం వైసీపీ అభ్యర్థుల విజయానికి దోహదపడ్డాయని చెప్పవచ్చు. గతంలో జరిగిన ఎన్నికల్లో నగర శివారు ప్రాంతాల్లో వైసీపీకి ఆదరణ ఎక్కువగా ఉండేది. తాజాగా జరిగిన ఎన్నికల్లో మాత్రం నగర పరిధిలోనే ఎక్కువ వార్డులు దక్కడం విశేషం. పెందుర్తి అసెంబ్లీలో పరిధిలో ఆరు వార్డులు వుంటే ఐదువార్డులను టీడీపీ దక్కించుకోగా, ఒకటి మాత్రమే వైసీపీకి దక్కింది. ఉత్తర నియోజకవ ర్గ పరిధిలో 17 వార్డులకు గానూ ఏకంగా 15 వార్డులు వైసీపీ గెలుచుకుంది.

కాస్తంత అసంతృప్తి

ఎట్టి పరిస్థితిలోను గెలిచి తీరాల్చిన అవసరం ఏర్పడింది. దీంతో నేతలు ఓడిపోతామనే అనుమానం ఉన్న, గట్టిపోటీ ఎదురవుతుందని గుర్తించిన వార్డులపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆయా వార్డుల్లో ప్రత్యేక బృందాలతో పంపకాలు చేపట్టారు. టీడీపీ, జనసేన స్వల్ప మెజారిటీతోనైనా గెలుస్తాయని భావించిన కొన్ని వార్డుల్లో సైతం వైసీపీ అభ్యర్థులు విజయం సాధించడానికి ఇదే కారణం కావచ్చు. ఏకపక్షంగా గెలుపొందుతామని భావించిన వైసీపీ నేతలకు 58 వార్డులు మాత్రమే దక్కడం కొంత అసంతృప్తికి గురిచేసింది. అదేవిషయాన్ని ఆ పార్టీ ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జి విజయసాయిరెడ్డి కూడా అంగీకరించారు.

Read more RELATED
Recommended to you

Latest news