కరోనా వైరస్‌ను అమెరికా ఈ ఏడాదే అంతం చేస్తుందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌లో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం అమెరికాలో 3 భిన్న వ్యాక్సిన్లకు చివరి దశ ట్రయల్స్ జరుగుతున్నాయని తెలిపారు. వాటిని అమెరికా ప్రజలందరికీ అందుబాటులో ఉంచేందుకు ఇప్పటికే పెద్ద ఎత్తున వ్యాక్సిన్ డోసులను ఉత్పత్తి చేస్తున్నామని తెలిపారు. ఈ ఏడాదే కరోనా వైరస్ కు సురక్షితమైన, ప్రభావవంతమైన టీకాను ప్రవేశపెడతామని తెలిపారు. కరోనా వైరస్‌ను అంతం చేస్తామన్నారు.
కాగా అంతకు ముందు డెమొక్రాటిక్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి కమలా హ్యారిస్ మాట్లాడుతూ.. కోవిడ్ 19 వ్యాప్తిని అరికట్టడంలో ట్రంప్ ప్రభుత్వం విఫలమైందన్నారు. అమెరికా ప్రజల ఆరోగ్యాన్ని ట్రంప్ విస్మరించారని మండిపడ్డారు. ఈ ఏడాది జనవరిలోనే వైరస్ వల్ల ప్రమాదం ఉంటుందని జో బిడెన్ హెచ్చరించినా ట్రంప్ పట్టించుకోలేదన్నారు.
ఇక అమెరికాలో ఇప్పటికే మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య 1.80 లక్షలకు చేరుకుంది. కొత్తగా అక్కడ 931 మంది చనిపోయారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 42,859 కరోనా కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 58.60 లక్షలకు చేరుకుంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశంగా అమెరికా ప్రస్తుతం మొదటి స్థానంలో కొనసాగుతోంది.