మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైంది. మునుగోడు ఉప ఎన్నికలలో విజయం సాధించి భవిష్యత్తులో ఎన్నికలకు పట్టు సాధించాలని అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. అయితే మునుగోడు ఉప ఎన్నికలలో పోటీ చేయాలా వద్దా అనే దానిపై సిపిఐ పార్టీ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో సిపిఐ నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడులో సిపిఐ పార్టీకి మంచి బలం ఉందని అన్నారు. ప్రస్తుతం మా ముందు మూడు ఆప్షన్లు ఉన్నాయని.. వాటిపైనే చర్చిస్తున్నామని తెలిపారు.
పార్టీలో అందరి అభిప్రాయాల మేరకే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు నారాయణ. టిఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు సిపిఐ మద్దతు అడుగుతున్నాయని.. మేము ఇంకా ఏ నిర్ణయం తీసుకోనప్పుడు మద్దతు అడిగిన వారికి ఏం చెప్తామని అన్నారు. తమ నిర్ణయం రేపు మధ్యాహ్నానికి ప్రకటిస్తామని తెలిపారు నారాయణ. మునుగోడు లో గెలుపోటములను డిసైడ్ చేసేది సిపిఐ పార్టీ ఒకటేనని.. ఎంత మంచి వ్యక్తి అయినా బిజెపిని ఓడించి తీరుతామన్నారు.