మన దేశంలో కరోనా వ్యాక్సిన్ కోసం ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో కేంద్రం ప్రకటన చేసింది. వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి 25-30 కోట్ల మంది భారతీయులకు కరోనా వైరస్ వ్యాక్సిన్ ను అందించనున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2021 మొదటి మూడు నెలల్లో భారతదేశానికి వ్యాక్సిన్ వస్తుందని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
ప్రపంచంలోని మొత్తం 250 వ్యాక్సిన్ తయారీదారులలో 30 మంది భారతదేశం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు అని… ఐదు వ్యాక్సిన్ లు భారతదేశంలో క్లినికల్ ట్రయల్ దశలో ఉన్నారని చెప్పారు. “టీకా సామర్థ్యం మరియు భద్రత ప్రభుత్వానికి రెండు ముఖ్యమైన ఎజెండా” అని ఆయన స్పష్టం చేసారు. భారత్ లో టీకా అత్యవసర వినియోగం కోసం కూడా ప్రయత్నం చేస్తున్నారు.