వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో జవసత్వాలు తగ్గుతాయి. దానివల్ల ఒక్కో అవయవం అంతకు ముందు పూర్వంలా పనిచేయకుండా అవుతుంది. ఎముకలు కూడా బలహీనంగా మారతాయి. ఐతే అందరికీ ఇది ఒకేలా ఉండదు. చాలామంది వృద్ధులు ఎంతో ఆరోగ్యంగా కనిపిస్తారు. బలహీనత తమ దరికి చేరకుండా ఉంటారు. అలా మీరు కూడా ఉండవచ్చు. కాకపోతే దానికోసం కొన్ని ప్రత్యేక అలవాట్లను చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే కొన్ని అలవాట్లను మానుకోవాల్సి ఉంటుంది.
ఎముకల బలహీనతకి కారణమయ్యే అలవాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పొగతాగడం
పొగతాగడం వల్ల శరీరంలో ఫ్రీ రాడికల్స్ పుట్టుకొస్తాయి. ఇవి ఎముకల కణాలను బలహీనపరుస్తాయి. అంతేకాదు ఒత్తిడి పెంచే కార్టిసాల్ ఎక్కువ విడుదల అవుతుంది. దానివల్ల ఎముకలు బలహీనంగా మారతాయి. అదీగాక రక్త కణాలపై ప్రభావం చూపి ఎముకలకు సరైన ఆక్సిజన్ అందకుండా చేస్తుంది.
శారీరక శ్రమ లేకపోవడం
శారీరక శ్రమ సరిగ్గా లేకపోవడం వలన కండరాలకు పెద్దగా పని ఉండదు. అప్పుడు ఎముకలు బలహీనంగా మారతాయి. శారీరక శ్రమ వల్ల కండరాలు అటూ ఇటూ కదిలి ఎముకలకు బలాన్ని అందిస్తాయి. బరువు తగ్గాలనుకుని, ఎముకలను బలంగా చేసుకోవాలనుకున్న వారు ఈరోజే వ్యాయామం ప్రారంభించండి.
అధిక మద్యపానం
మద్యపానం ఎక్కువగా తీసుకోవడం వల్ల ఒత్తిడి పెంచే కార్టిసాల్ హార్మోనే ఉత్పత్తి అవుతుంది. ముందే చెప్పినట్టు దీనివల్ల ఎముకలు బలహీనంగా మారతాయి.
ఉప్పు వినియోగం ఎక్కువ కావడం
ఆహారంలో ఉప్పు వినియోగం ఎక్కువ చేస్తున్నారంటే అది వినాశనానికి దారి తీయవచ్చు. ఎముకల సాంద్రతను దెబ్బతీయడంలో ఉప్పు కీలక పాత్ర వహిస్తుంది. దీనివల్ల కాల్షియం లోపం కలుగుతుంది. సాధారణంగా ఒక గ్రాము ఉప్పు తీసుకునే మహిళల్లో ఎముక సాంద్రత ఒక శాతం కోల్పోతుంది. అందుకే రోజులో 2300మిల్లీ గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు వినియోగించవద్దు.