ఎక్కువ మంది ఉంటే పార్టీ బలంగా ఉంటుందని భావిస్తే.. మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అన్నట్టు వ్యవహరిస్తున్నారట నాయకులు.పశ్చిమగోదావరి జిల్లా వైసీపీలో ప్రజాప్రతినిధులు. రాజకీయ విభేదాలు, అంతర్గత కుమ్ములాటలు ఓ రేంజ్‌లో సాగుతున్నాయని చర్చ నడుస్తుంది.
రాజకీయ చైతన్యం కలిగిన పశ్చిమగోదావరి జిల్లాలో ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపితే.. ఆ పార్టీ అధికారంలోకి వచ్చినట్టే. 2019 ఎన్నికల్లోనూ ఇదే రిపీటైంది. రెండు అసెంబ్లీ సీట్లు మినహా అన్నీ వైసీపీ ఖాతాలోనే పడ్డాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత జిల్లాకు మూడు మంత్రిపదవులు ఇచ్చారు సీఎం జగన్. ఈ మూడింటిలో ఒకటి డిప్యూటీ సీఎం. జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ మంత్రులు, కేడర్‌కు.. పార్టీ నేతలకు, శ్రేణులకు పొసగడం లేదు. ఆ మధ్య ఉండి నియోజకవర్గంలో పార్టీ ఇంఛార్జ్ PVL నరసింహారాజుకు వ్యతిరేకంగా నిరసన శిబిరాలే వెలిశాయి.
ఏలూరు వరకూ డిప్యూటీ సీఎం ఆళ్ల నానిదే హవా. ఆచంటలో పార్టీ కేడర్ మంత్రి శ్రీరంగనాథరాజుకు ముచ్చెమటలు పట్టిస్తోందట. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీలో స్థానిక నేతలు డబ్బులు వసూలు చేశారనే విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి. మరి.. మంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారట జనం. పార్టీ కేడర్‌పై ఆయన పట్టుకోల్పోయారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయట.
కొవ్వూరులోనూ మంత్రి తానేటి వనిత, స్థానిక వైసీపీ కేడర్‌కు మధ్య గ్యాప్ వచ్చిందట. గోపాలపురానికి చెందిన వనితను కొవ్వూరు నుంచి పోటీ చేయించారు. గెలిచాక మంత్రిని చేశారు. కానీ.. లోకల్ కేడర్ ఆమెను పొరుగు వ్యక్తిగా చూస్తున్నారో లేక ఆమె పలకరించడం లేదో కానీ దూరం అంతకంతకూ పెరుగుతోందట. మేమూ వైసీపీలోనే ఉన్నాం అని అప్పుడప్పుడూ స్థానిక నాయకులు ప్రకటనలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఉందని సమాచారం. మరి.. జిల్లాలో సమస్యలు పరిష్కరించి నేతలను ఒకేతాటిపైకి తీసుకొచ్చేందుకు పార్టీ పెద్దలు ఎలాంటి మంత్రం వేస్తారో చూడాలి.