కుర్ర ఓపెనర్లు టీ20 మజాను చంపేస్తున్నారు: క్రిస్ గేల్

వెస్టిండీస్ ఆల్‌రౌండర్ క్రిస్ గేల్ క్రీజులో ఉన్నాడంటే అభిమానులకు పండుగే. సిక్సర్లు, బౌండరీల మోత మోగిస్తుంటాడు. తన విధ్వంసక బ్యాటింగ్ విన్యాసాలతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు. అందుకే అభిమానులు ‘యూనివర్సల్ బాస్’ అని ప్రేమగా పిలుచుకుంటారు. అయితే, మోడరన్ డే ఓపెనర్ల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నాడు గేల్.

టీ20లో మోడరన్ డే ఓపెనర్ల అప్రోచ్ సరిగ్గా ఉండటం లేదని గేల్ విమర్శించారు. ‘మొదటి ఓవర్ నుంచే ఓపెనర్లు బ్యాట్స్‌మెన్ బ్యాట్‌కు పని చెప్పాలి. కానీ, నాటకీయంగా నెమ్మదిగా ఆడుతుండటంతో టీ20 మ్యాచ్‌లు నెమ్మదిగా సాగుతున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే టీ20 క్రికెట్ మజాను మోడరన్ డే ఓపెనర్లు చంపేస్తున్నారు. ఎందుకంటే, మొదటి ఆరు ఓవర్లలో మేము వీలైన్ని ఎక్కువ పరుగులు రాబట్టగలిగే వాళ్లం. కానీ, కుర్రుళ్లు అందుకు విరుద్ధంగా భారీ షాట్లు ఆడటానికి కొంత సమయం తీసుకుంటున్నారు’ అని గేల్ పేర్కొన్నాడు.