ప్రధానితో సమావేశం తర్వాత జమ్మూ కాశ్మీర్ నేతలు ఏమన్నారు? 

ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూ కాశ్మీర్ నాయకులతో గురువారం సమావేశమైన సంగతి తెలిసిందే. జమ్మూ కాశ్మీర్ ని కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత మొదటి సారి రాజకీయ నాయకులతో ప్రధాని సమావేశం అయ్యారు. ఈ నేపథ్యంలో సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో ముచ్చటించిన రాజకీయ నేతలు ఈ విధంగా మాట్లాడారు. నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, మాజీ జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా చెప్పిన దాని ప్రకారం, సమావేశంలో ముఖ్యంగా ఆర్టికల్ 370 గురించే చర్చ జరిగింది.

ఆర్టికల్ 370రద్దుని వెనక్కి తీసుకోవాలని, ఈ విషయం పట్ల కాశ్మీరీ ప్రజలు సుముఖంగా లేరని, అందువల్ల రద్దు చేసిన దాన్ని మళ్లీ పునరుద్ధరించాలని కోరారు. ఈ విషయంలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోమని, కాకపోతే పోరాడతామని అన్నారు. మెహబూబా మఫ్తీ మాట్లాడుతూ, పాకిస్తాన్ తో వాణిజ్యం తదితర అంశాలను సమీక్షించాలని, ప్రత్యేక ప్రతిపత్తిని చట్టవిరుద్ధంగా రద్దు చేసారని, మళ్ళీ పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని అన్నారు.