ఏ గణపతిని ఆరాధిస్తే ఏం ఫలితం ? లోహం నుంచి మట్టి వరకు

-

గణపతి ఆరాధన రకరకాలుగా ఉన్నాయి. శాంత రూపం నుంచి ఉగ్రరూపం వరకు లోహం నుంచి మట్టి వరకు ఇలా రకరకాల రూపాల గణపతులను ఆరాధిస్తే రకరకాల ఫలితాలు వస్తాయని శాస్త్ర ప్రవచనం. వాటి గురించి తెలుసుకుందాం…

గ్రహచారరీత్యా మనం చేసిన దోషాలు తొలగించుకోవడానికి గణేశారాధన మంచిది. సూర్యదోష నివారణకు ఎర్రచందనంతో చేసిన గణపతిని పూజించాలి. చంద్ర దోష నివారణకు వెండి లేక పాలరాయితో చేసిన వినాయకుడిని పూజించాలి.

కుజదోష నివారణకు రాగితో చేసిన వినాయకుడిని పూజిస్తే ఫలితం ఉంటుంది. బుధ దోష నివారణకు మరకత గణపతిని అర్చించాలి. గురు దోష నివారణకు పసుపు, చందనం లేక బంగారంతో చేసిన గణపతిని కొలవాలి. శుక్ర దోష నివారణకు స్ఫటిక గణపతిని, శని దోష నివారణకు నల్లరాయిపై చెక్కిన గణపతిని పూజించాలి. రాహు గ్రహ దోషానికి మట్టితో చేసిన గణపతిని పుజిస్తే ఫలితం ఉంటుంది. కేతు గ్రహ దోష నివారణకు తెల్ల జిల్లేడుతో చేసిన గణపతిని పూజించాలి.

ఎర్రచందనంతో చేసిన గణపతిని పూజించడం వల్ల అనారోగ్య సమస్యలు, పగడపు గణపతిని పూజించడం వల్ల అప్పుల బాధలు తొలగిపోతాయి. పాలరాయితో చేసిన గణపతిఅని పూజిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది. మనకు ఎదురవుతున్న సమస్యలు తొలగిపోవాలంటే శ్వేతార్క గణపతిని పూజించాలి. స్ఫటిక గణపతి సుఖశాంతులు ప్రసాదిస్తాడు. మట్టి గణపతిని ఆరాధిస్తే సకల శుభాలను ఇస్తాడు. ఇక హరిద్ర, పాదరస, పసుపుకొమ్ము ఇలా రకరకాల గణపతులను పూజిస్తే విశేష ఫలితాలు వస్తాయి. భక్తితో, శ్రద్ధతో ఎంత పూజిస్తే అంతకు రెట్టింపు ఫలితం ఇస్తాడు. ఇక ఆలస్యం ఎందుకు విఘ్ననాయకుడుని పూజించి సకల కోరికలను నెరవేర్చుకోండి.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news