మొన్న శ్రీశైలం పవర్ ప్లాంట్‌లో జరిగిన అగ్ని ప్రమాదం దుర్ఘటన ఇంకా మరువక ముందే నిన్న రాత్రి సంగారెడ్డి జిల్లాలోని గుమ్మడిదల మండలం దోమడుగులోని గోడౌన్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు గోడౌన్ నలువైపులా వ్యాపించడంతో భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. స్థానికులు అందించిన సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు చేయగా మొత్తం అదుపులోకి తీసుకు రావడానికి ఎనిమిది గంటలు పట్టింది.
ఈ మంటల్లో రెండు లారీలు కాలిపోగా, గో డౌన్ మొత్తం ఆనవాళ్లు లేకుండా కాలి బూడిదయింది. ఓరా పెట్రో కెమికల్స్ పేరిట అనుమతులు తీసుకున్న నిర్వాహకులు విచ్చలవిడిగా సాల్వెంట్ ను నిలువ చేసినట్టు తెలుస్తోంది. సేఫ్టీ మెజర్స్ పాటించకుండా డ్రమ్ముల్లో సాల్వెంట్ ను నిలువ చేయడం వల్లనే ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ.. అసలు కారణం ఏంటనేది ఇంకా తెలియరాలేదు.