సాధారణంగా ఈ రోజుల్లో కొంత మంది పిల్లలను చూడగానే చాలా మంది చేసే వ్యాఖ్య వాళ్లకు సంస్కారం లేదూ అని. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఉండే పిల్లలను చూసి ఇవే వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. వాళ్ళ ప్రవర్తన, మాటలు, రకరకాల పనులను ఆధారంగా చేసుకుని ఈ వ్యాఖ్యలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అసలు వాళ్లకు నిజంగా సంస్కారం లేదా లేక తల్లి తండ్రులు నేర్పడం లేదా…?
తల్లి తండ్రులు నేర్పడం లేదూ అనడం కంటే వాళ్ళను సరిగా పట్టించుకోవడం లేదనే వ్యాఖ్యలే వినపడుతున్నాయి. తల్లి తండ్రీ ఇద్దరు ఉద్యోగస్తులు అయ్యారూ అనుకుందాం. డబ్బు ఎక్కువగా వస్తుంది కాబట్టి వాళ్ళ ధ్యాస భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని ఎక్కువగా సంపాదిస్తూ ఉంటారు. అంత వరకు బాగానే ఉంటుంది గాని… మరి ఆ డబ్బు సంపాదించేది పిల్లల కోసమే కదా…?
మరి ఆ పిల్లలను ఎంత వరకు పట్టించుకుంటారు…? పట్టించుకోవడం అంటే పాకెట్ మనీ ఇవ్వడమా…? లేక అడిగింది కొనడమా…? అడిగిన చోటకు పంపించడమా…? లేక వారానికి ఒకసారి సినిమాకు లేదా వింతలు వినోదాలకు తీసుకువెళ్లడమా…? ఆఫీసు నుంచి రాగానే అలసిపోయి వచ్చి షూ కూడా విప్పలేక తండ్రి ఇబ్బంది పడి అలాగే మంచం మీద పడుకుంటాడు.
తల్లి కూడా నీరసంగా వస్తుంది… ఉదయమే వచ్చిన వంట మనిషి వంట చేస్తే దాన్ని ఓవెన్ లో పెట్టుకుని, అది వేడి అయ్యే లోపు బట్టలు మార్చుకుని తింటారు. సరే బాగానే ఉంటుంది కదా… పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఐపాడ్, లేదా స్మార్ట్ ఫోన్ లేదా లాప్ టాప్ పట్టుకుని కూర్చుంటారు. వాళ్ళు ఎం చేస్తున్నారో…? ఎవరితో మాట్లాడుతున్నారో…? ఎం చూస్తున్నారో తెలియదు.
ఇక వాళ్ళను దగ్గరకు తీసుకుని మాట్లాడే పరిస్థితి లేదు. వాళ్ళతో మాట్లాడే అవకాశం అంతకన్నా లేదు. అమ్మా నాన్న అని పిల్లాడు దగ్గరకు వస్తే ఎవరి ఫోన్ వాళ్ళు చూసుకోవడం పిల్లాడు ఐపాడ్ చూసుకోవడ౦. వాళ్ళ ఫోన్ నొక్కడం అయిపోయిన తర్వాత వాళ్లకు నిద్ర వస్తుంది. మరి పిల్లాడితో మాట్లాడేది ఎప్పుడు…? ఉదయమే లేస్తారు. పిల్లాడు స్కూల్ కి రెడీ అవుతూ ఉంటాడు.
వీళ్ళు కూడా ఆఫీస్ కి రెడీ అవుతూ ఉంటారు. బుక్స్ అన్నీ ఉన్నాయా…? షూ బాగుందా…? పాకెట్ మనీ కావాలా..? ఈవెనింగ్ స్నాక్స్ ఎం తింటావ్…? రేపు షాపింగ్ కి వెళ్దామా…? ఈ మాటలు తప్పించి పెద్దగా తల్లి తండ్రులు మాట్లాడే మాటలే ఈ రోజుల్లో నగరాల్లో లేవు అనే చెప్పాలి. సరే తల్లి గృహిణి అయింది అనుకుందాం… స్కూల్ నుంచి రాగానే ఆడుకోవడానికి స్మార్ట్ ఫోన్ ఇస్తుంది.
చిన్నప్పుడు అల్లరి చేస్తాడు కాబట్టి ఫోన్ ఇస్తారు. అది స్కూల్ లెవెల్ లో అలవాటు అవుతుంది. అదే జరుగుతుంది… స్కూల్ నుంచి రాగానే అమ్మ నోట్లో అన్నం పెడితే తింటూ ఫోన్ నొక్కడం. ఇంకా ఆ పిల్లాడు నేర్చుకునేది ఎక్కడా…? ఆ పిల్లాడికి నేర్పేది ఎక్కడా…? దీని మీద తల్లి తండ్రులు కచ్చితంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీకు ఎన్ని కారణాలు అయినా ఉండవచ్చు పిల్లలు అనేది ప్రధానం.
మీ జీవితంలో మీకు తోడు ఉండేది పిల్లలే. తల్లి తండ్రులు స్వేచ్చ ఇచ్చిన పిల్లలు, తల్లి తండ్రులు సంస్కారం నేర్పని పిల్లలు ఇప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వ్యసనాలకు, ఇతర అలవాట్లకు, దొంగ తనాలకు, రేప్ లకు, మరొకటి మరొకటి వాళ్ళు నేర్చుకునే పరిస్థితి ఏర్పడింది. ఎవరైనా ఎదురు పడితే మాట్లాడే పరిస్థితి లేదు. పండగలు, పబ్బాలు మన సంస్కృతి సాంప్రదాయం అనేది తెలియదు.
డబ్బు విలువ, ఆహారం విలువ, మనుషుల విలువ, మాట విలువ అనేది వాళ్లకు తెలియడం లేదు. మీ అవసరాలు మీ వ్యాపారాలు అనేవి పిల్లల జీవితాలను నాశనం చేస్తున్నాయి గాని ఎక్కడ ముందుకి అడుగు సరైన మార్గంలో పడినట్టు కనపడటం లేదు. నేడు పరిస్థితులు అనేవి మీరు అనుకున్నట్టు లేదు మీకు అనుకూలంగానూ లేవు. కాబట్టి పిల్లలకు నేర్పాల్సిన అవసరం ఉంది. పిల్లల జీవితం లేని రోజు మీరు ఎం సాధించినా ఉపయోగం లేదు.
డబ్బుల విలువ అనేది తెలియాలి. మనుషుల విలువ, మాట విలువ అనేది కచ్చితంగా తెలియాలి. మీ పిల్లలు సమాజానికి ప్రమాదకరమయ్యే అవకాశాలు ఉన్నాయి. అవును వాళ్ళ ఆలోచనలు నేటి పరిస్థితులు ఆధారంగా అలానే ఉన్నాయి. సక్రమంగా పిల్లలను పెంచే వాళ్లకు కాదు. పిల్లలను కనీసం పట్టించుకోని డబ్బు పిచ్చి, వ్యాపార పిచ్చి లేదా మరొక పిచ్చి ఉన్న తల్లి తండ్రులకు మాత్రమే ఇది అంకితం…!