ఈటల రాజేందర్ (Etela Rajender) గులాబీ వనం నుంచి కమల వనంలోకి ఎంటర్ అయ్యారు. టీఆర్ ఎస్‌లో గౌరవం లేదని అందుకే బీజేపీలో చేరుతున్నట్టు ఆయన తెలిపారు. తన మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయినప్పటి నుంచి ఇప్పటి దాకా టీఆర్ఎస్‌లో ఆత్మగౌరవం లేదన్న విషయంపైనే ప్రధానంగా ఈటల మాట్లాడుతూ వచ్చారు. కానీ ఇప్పుడు బీజేపీలో కూడా ఆయనకు తొలిరోజే గౌరవం ఇవ్వలేదనే విమర్శలు వస్తున్నాయి.
భారీ అనుచరగణంతో ఢిల్లీ వెళ్లి మరీ బీజేపీలో చేరారు ఈటల రాజేందర్. అయితే మొదట్లో బాగానే ఆదరించిన బీజేపీ అగ్ర నేతలు అమిత్ షా, జేపీ నడ్డా తీరా చేరే సమయానికి ఈటల మెడలో కండువా కప్పకపోవడమే ఇక్కడ పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. దీంతో ఈటల రాజేందర్‌కు బీజేపీ ఇప్పుడే ప్రాముఖ్యత తగ్గిస్తోందనే ప్రచారం సాగింది.
మొదటి నుంచి నడ్డా లేదా అమిత్‌షా సమక్షంలోనే ఈటల చేరుతారని వారే కండువా కప్పుతారని అంతా అనుకున్నారు. కానీ చివరకు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వచ్చి కప్పడం ఇక్కడ టీఆర్ఎస్ నాయకత్వానికి ఆనందం కలిగించే విషయంగా మారింది. నడ్డా లేదా అమిత్ షా సమక్షంలో ఈటల చేరడం వల్ల ఈటలకు బాగా ప్రాముఖ్యత దక్కుతుందని అంతా అనుకున్నారు. కానీ అసలు టైమ్‌కు వారిద్దరూ హ్యాండ్ ఇవ్వడం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది.