అంబర్ పేట లోని రాచకొండ పోలీస్ కమీషనరేట్ CAR హెడ్ క్వార్టర్స్ లో పోలీస్ అమరవీరుల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. అమరులైన పోలీసులకు నివాళులు అర్పించి, శ్రద్ధాంజలి ఘటించారు రాచకొండ సీపీ మహేష్ భగవత్ మరియు ఇతర పోలీస్ ఉన్నతాధికారులు.
ఈ సందర్భంగా రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ మాట్లాడుతూ.. విధి నిర్వహణ లో అమరులైన పోలీసులకు డిపార్ట్ మెంట్ అండగా ఉంటుందని.. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా 264 మంది అమరులైయ్యారని అన్నారు. అమర జవానుల త్యాగాలు, దేశవ్యాప్తంగా అమరులైన పోలీసుల గుర్తుగా పోలీసు అమరవీరుల దినోత్సవం జరుపుకుంటామన్నారు. కష్టాలలో ఉన్నప్పుడు దేవుడిని వేడుకున్నా ముందు వచ్చేది పోలీసేనని గుర్తు చేశారు.
ప్రజల మాన, ప్రాణాలను కాపాడేదీ కూడా పోలీసేనని, శాంతిభద్రతల పర్యవేక్షణే కాకుండా సమాజంలో అన్ని మార్పులకు అణుగుణంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని అన్నారు. డయల్ 100 కు కాల్ చేస్తే వెంటనే పోలీసులు అక్కడ ప్రత్యక్షమవుతారని అన్నారు. మారుతున్న కాలానికణుగుణంగా పోలీసులు కష్టపడుతున్నారని తెలిపారు. పండుగలు, శుభకార్యాల కు పహారా కాసేది కూడా పోలీసులేనని సగర్వంగా చెప్పుకుంటున్నామని సిపి మహేష్ భగవత్ తెలిపారు.