ప‌రిటాల ఫ్యామిలీలో నాటి మెరుపులు ఇప్పుడు ఏవీ?

-

అనంత‌పురం జిల్లా రాజ‌కీయాల్లో ప‌రిటాల పేరుకు ఉన్న ప్ర‌త్యేక‌త అంతా ఇంతా కాదు. ప‌రిటాల ర‌వి రాజ‌కీయాలు ఈ జిల్లాలోనే కాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌త్యేక ముద్ర వేసుకున్నాయి. ర‌వి తండ్రి, తాత‌ల కాలం నుంచి ఇక్క‌డ రాజ‌కీయాలు చేశారు. ఇక‌, ర‌వి రాజ‌కీయాల్లోకి వ‌చ్చాక‌.. ఈ కుటుంబ రాజ‌కీయాలు అనూహ్య‌మైన మ‌లుపులు తిరిగాయి. టీడీపీలో ఉండ‌గా.. ఆయ‌న ప్ర‌జ‌ల‌కు మరింత ద‌గ్గ‌ర‌య్యారు. పార్టీతో సంబంధం లేకుండా వ్య‌క్తిగ‌త ఇమేజ్ పెంచుకున్నారు. ప్ర‌జ‌లు ఏ క‌ష్టంలో ఉన్నా.. వారికి చేరువ అయ్యారు. నేనున్నానంటూ.. ఆయ‌న ప్ర‌జ‌ల‌ను అన్ని విధాలా ఆదుకున్నారు. ఇదే ప‌రిటాల‌కు జిల్లా వ్యాప్తంగా బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టేలా చేసింది.

జిల్లాలోని రాప్తాడు, పెనుకొండ నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌రిటాల కుటుంబానికి మంచి ఫాలోయింగ్ ఉంది. ర‌వి జీవించి ఉన్న రోజుల్లో ప్ర‌జ‌లు నిత్యం ఈ ఇంటికి క్యూక‌ట్టేవారు. త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకొనేవారు. వారి ఇళ్ల‌లో జ‌రిగే శుభ‌కార్యాలకు పిలిచేవారు. అయితే, అనూహ్య కార‌ణాల‌తో ర‌వి అస్త‌మించిన త‌ర్వాత‌.. ఆయ‌న స‌తీమ‌ణి ప‌రిటాల సునీత రంగంలోకి వ‌చ్చారు. వరుస విజ‌యాలు ద‌క్కించుకున్నారు. రాప్తాడులో గుర్తింపు సాధించారు. చంద్ర‌బాబు కేబినెట్‌లో మంత్రిగా కూడా చ‌క్రం తిప్పారు. అయితే, ర‌వి తాలూకు గుర్తింపును పొంద‌లేక పోయారు. అదేస‌మ‌యంలో గ‌త ఏడాది ఎన్నిక‌లకు ముందు ర‌వి వార‌సుడిగా ప‌రిటాల శ్రీరాం రంగంలోకి వ‌చ్చారు. భారీ అంచ‌నాలు కూడా ఏర్ప‌డ్డాయి. టీడీపీ కూడా శ్రీరాంకు టికెట్ ఇచ్చింది.

నిజానికి గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో రాష్ట్రంలో తిరిగి టీడీపీ అధికారంలోకి వ‌స్తుందా?  రాదా? అనేది ఒక చ‌ర్చ అయితే.. దీనిని మించిన చ‌ర్చ రాప్తాడులో ప‌రిటాల శ్రీరాం సాధించే మెజారిటీపైనే సాగింది. ల‌క్ష‌ల‌కు ల‌క్ష‌లు పందేలు కూడా సాగాయ‌ని అప్ప‌ట్లో ప్ర‌చారం జ‌రిగింది. అయితే, అనూహ్యంగా శ్రీరాం ప‌రాజ‌యం పాల‌య్యారు. నిజానికి ప‌రిటాల కుటుంబంలో త‌లెత్తిన తొలి ఓట‌మిగా దీనిని పేర్కొన్నారు ప‌రిటాల అభిమానులు. స‌రే.. రాజ‌కీయాల్లో గెలుపు ఓట‌ములు స‌హ‌జ‌మే అయితే.. ఓట‌మి త‌ర్వాత నుంచి శ్రీరాం.. ప్ర‌జ‌ల‌కు చేరువ అయింది లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌తంలో తండ్రి ర‌వి.. గెలుపు ఓట‌ముల‌తో సంబంధం లేకుండా ప్ర‌జ‌ల‌కు నిత్యం చేరువ‌య్యేవార‌ని, అదేస‌మ‌యంలో విస్తృత రాజ‌కీయ ప‌రిచ‌యాలు పెంచుకున్నార‌ని, అదేస‌మ‌యంలో సినీ రంగంలోనూ ప‌రిచ‌యాలు ఉన్నాయ‌ని..

కానీ, ఇప్పుడు శ్రీరాంకు ఆత‌ర‌హా దూకుడు, వ్యూహాలు క‌నిపించ‌డం లేద‌నేది ప్ర‌ధాన విమ‌ర్శ‌. రాజకీయాల్లో గెలుపు గుర్రం ఎక్కుతామా లేదా? అనేది ప్ర‌జ‌ల చేతుల్లో ఉండే నిర్ణ‌యం. కానీ, రాజ‌కీయాలు చేయ‌డం, ప్ర‌జ‌ల‌కు చేరువ కావ‌డం అనేది ముఖ్య‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. కానీ, శ్రీరాంలో ఆ త‌ర‌హా దూకుడు ఎక్క‌డా క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు. మ‌రి ఇప్ప‌టికైనా ఆయ‌న మార్పు దిశ‌గా అడుగులు వేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news