రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ఎవరూ చెప్పలేరు. ఏ వ్యూహం ఎలా ఉంటుందో.. ఎలాంటి స్పెట్ వేస్తే.. ఎటు పడుతుందో.. అనేది నాయకులు తల్లడిల్లుతుంటారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితే.. కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ నాయకురాలు.. పనబాక లక్ష్మిని కూడా వెంటాడుతోందని అంటున్నారు. కాంగ్రెస్‌లో సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్నప్పటికీ.. వ్యూహాత్మకంగా పనబాక ముందుకు సాగిన దాఖలాలు మనకు కనిపించవు. తర్వాత వైసీపీ ఆఫర్ ఇస్తే.. జగన్‌పై ఉన్న కేసుల ముద్ర కారణంగానే తప్పుకొన్నారు తప్ప.. మరేకారణం అప్పట్లో పనబాక చెప్పలేక పోయారు. అంటే.. రాజకీయంగా వ్యూహాల లేమి పనబాక కృష్ణయ్య, లక్ష్మిల ఫ్యామిలీని వేధించిందనేది వాస్తవం.
ఇక తర్వాత టీడీపీలోకి వచ్చారు. అది కూడా ఆలస్యంగా కళ్లు తెరిచారు. అయినా కూడా గత ఏడాది ఎన్నికల్లో తిరుపతి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేశారు. అయితే.. ఆ ఎన్నికల్లోనూ టీడీపీ నేతలను సమన్వయం చేసుకోలేక పోయారు. ఫలితంగా దాదాపు రెండు లక్షలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక, అంత సీనియర్ నాయకురాలే అయినా.. గెలుపు ఓటములకు అతీతంగా వ్యవహరించలేక పోయారు. ఓడిపోయినా.. ప్రజలకు చేరువ అవుదాం.. అనే విషయం విస్మరించారు. ఇంటికే పరిమితమయ్యారు.
కట్ చేస్తే.. ఇప్పుడు చంద్రబాబు తిరుపతి ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో మరోసారి పనబాకకే టికెట్ ఇచ్చారు. వాస్తవానికి మూడు మాసాలకు పైగా సమయం ఉన్నప్పటికీ.. చంద్రబాబు ఆమె అభ్యర్థిత్వాన్ని ప్రకటించేశారు. నిజానికి ఇలాంటి పరిస్థితి ఇతర ఏ అభ్యర్థికి దక్కినా.. వెంటనే స్పందిస్తారు. వెంటనే రంగంలోకి దూకేస్తారు. గతంలో ఎదురైన పరాభవాలు, ఎక్కడ ఓటు బ్యాంకుకు చిల్లు పడింది. ఎవరు సహకరిస్తారు ? ఎవరు వ్యతిరేకిస్తున్నారు ? అనే అంచనాలు వేసుకుని.. వ్యతిరేక వర్గాన్ని కూడగట్టుకునే ప్రయత్నం చేస్తారు. నియోజకవర్గంలో ప్రజలకు కూడా చేరువ అవుతారు.
ఇదే సమయంలో ప్రత్యర్థి లోటు పాట్లను కూడా పరిశీలిస్తారు. కానీ.. చంద్రబాబు.. పనబాక అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి .. వారం గడిచిపోయినా.. ఇప్పటి వరకు ఆమె స్పందించలేదు. నియోజకర్గంలోని నేతలతోనూ మాట్లాడలేదు. మరీ ముఖ్యంగా మీడియా ముందుకు కూడా ఆమె రాలేదు. అంటే.. దీనిని బట్టి.. ఆమెకు టీడీపీ తరఫున పోటీ చేసే ఆసక్తి లేదని అనుకోవాలా ? లేక. ఇప్పటి నుంచే ప్రచారం ప్రారంభించినా.. నియోజకవర్గంలో పర్యటించినా.. ఖర్చు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతుందని అనుకున్నారా ? అసలు ఆమె వ్యూహం ఏంటనేది ఆసక్తిగా మారింది. మరి ఏం చేస్తారో చూడాలి.