రోడ్లు, విద్యుత్, తాగేందుకు నీళ్లు ఇవి కదా మౌలిక వసతులు. వీటిపై మాట్లాడి అటుపై ఏమయినా చేయాలి. అందుకు తగ్గ ప్రణాళికలు కూడా సిద్ధం చేయాలి. వాస్తవానికి పంచాయతీలకు నిధులు లేవు. కేంద్రం ఇచ్చిన నిధులు లాక్కొంది రాష్ట్ర సర్కారు అని వార్తలు నిర్థారణలో ఉన్నాయి. ఇక మే లో గడపగడపకూ వైసీపీ కార్యక్రమం నిర్వహించాలంటే ఎమ్మెల్యేలు హడలి పోతున్నారు. ఎందుకంటే గ్రామాలకు సంబంధించి చిన్న చిన్న పనులు కూడా చేయించలేని అవస్థల్లో ఎమ్మెల్యేలు ఉన్నారన్నది ఓ వాస్తవం. అందుకే తాము ఎలా అయినా నియోజకవర్గాల్లో తలెత్తుకు తిరగాలన్నది వారి భావన. పదవులు పోయిన మంత్రులు కూడా భయపడిపోతున్నారు. పోలీసు రక్షణలో ఇంత కాలం తిరిగిన తాము ఇకపై ఒంటరిగా వెళ్లాలంటే స్థానిక ప్రతిఘటనకు సమాధానం ఎలా ఇవ్వాలి అని హడలిపోతున్నారు. ఈ నేపథ్యంలో సమస్య ఎలా పరిష్కారానికి నోచుకుంటుందని ?
జిల్లాలకు వెళ్లి క్షేత్ర స్థాయిలో సమస్యలు తెలుసుకునే ప్రయత్నాలు చేయమని ఎంఎల్ఏలకు ఆదేశాలు ఇచ్చారు. ఎంపీలకూ దిశను నిర్దేశం చేశారు యువ ముఖ్యమంత్రి జగన్. కానీ నిధుల లేమి వారిని వెన్నాడుతోంది. తప్పకుండా చేయాల్సిన పనులకు నిధులు లేవు అన్నది ఓ వాస్తవం. ఈ క్రమాన క్షేత్ర స్థాయిలో తిరుగుబాటు తప్పదు అని ఇవాళే తేలిపోయింది పశ్చిమగోదావరి జిల్లాలో.. ! ఈ నేపథ్యంలోనే గోపాలపురం ఎమ్మెల్యే వెంకట్రావుపై భౌతిక దాడి కూడా జరిగింది. దాడికి కారణాలు ఏమయినా కానీ ప్రస్తుతం మాత్రం సొంత కార్యకర్తలే ఆయన విషయమై విసిగిపోయారని అందుకే ప్రతిఘటించారని వార్తలొస్తున్నాయి. ఇదంతా ప్రాథమిక సమాచారం అనుసరించి రాస్తున్న వివరం.
వాస్తవానికి మొన్నటి వేళ పార్టీ పెద్దలతో సమావేశం అయిన జగన్ తనదైన శైలిలో దిశను నిర్దేశం చేస్తూనే నియోజకవర్గ అభివృద్ధి నిమిత్తం ఒక్కో ఎమ్మెల్యేకూ 2 కోట్లు ఇస్తామన్నారు. వైసీపీ ఖాతాలో 151 ఎమ్మెల్యేలు ఉన్నారు. వైసీపీకి మద్దతుగా అసెంబ్లీలో టీడీపీ నుంచి ఇద్దరు, జనసేన నుంచి ఒకరు ఉన్నారు. అంటే ఎలా చూసుకున్నా కనీసం సొంత పార్టీ మనుషులకు అయినా నిధులు ఇవ్వాలన్నా 352కోట్లు అవసరం.. ఆ మొత్తం ఇచ్చారో ఇవ్వలేదో స్పష్టత లేదు. అదేవిధంగా మే లో గ్రామ పంచాయతీల నిధులు కొంత సెటిల్ చేస్తామని చెప్పారు. వాటికి కూడా కొంత సందిగ్ధత ఉంది. వీటన్నింటి దృష్టిలో ఉంచుకుంటే రానున్న కాలంలో ఫీల్డ్ విజిట్ చేయాలంటే, వైసీపీ కరపత్రాలతో, ఎన్నికల ప్రణాళికల కాగితాలతో ముందుకు వెళ్లాంటే వైసీపీ ఎంఎల్ఏలకు కష్టమే !