అమెరికా చరిత్రలో ఎన్నడూచూడని ఘటన అది..కేపిటల్ హిల్‌ను ట్రంప్ మద్దతుదారులు చుట్టుముట్టడమే కాదు.. లోనికి దూసుకెళ్లి రచ్చచేశారు. అగ్రరాజ్యాన్ని కుదిపేసిన ఈ విధ్వంసం ప్రీ ప్లాన్డ్‌గా జరిగిందా..? ట్రంప్ మద్దతుదారులు ఒక్కసారిగా కేపిటల్ హిల్‌ను ఎలా చుట్టుముట్టారు..? భద్రతను ఎలా చేధించగలిగారు అసలు యూఎస్ కేపిటల్ హిల్ విధ్వంసం వెనుక ఎవరున్నారు…
అమెరికా ప్రజాస్వామ్య చరిత్రలో మాయని మచ్చ ఇది.. కాంగ్రెస్ సభ్యుల సమావేశంలోకి ఒక్కసారిగా ట్రంప్ మద్దతుదారులు దూసుకురావడం.. విధ్వంసం సృష్టించడం కలకలం రేపింది. జో బైడెన్‌ను కాంగ్రెస్ సభ్యులు విజేతగా గుర్తించేందుకు సిద్ధమైన సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడం సంచలనంగా మారింది. ఒక్కసారిగా వేలాది మంది ట్రంప్ మద్దతుదారులు పోలీసులను చేధించుకుని.. చట్టసభల వైపు వచ్చి హంగామా చేయడం ఇప్పుడు అమెరికాలో హాట్ టాపిక్ అవుతోంది. కానీ ఇదెలా జరిగింది. ఈ కుట్ర వెనుక ఉందెవరు అన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతుంది.
కేపిటల్ హిల్‌లో విధ్వంసానికి సరిగ్గా గంట ముందు ట్రంప్ తన మద్దతుదారులతో ర్యాలీ నిర్వహించారు. అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు గుప్పిస్తోన్న ట్రంప్.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. తన మద్దతుదారులందరినీ కేపిటల్ హిల్ వైపు వెళ్లాలని.. అక్కడ ఆందోళనలు చేయాలని పిలుపునిచ్చారు. అంతేకాదు.. తాను స్వయంగా పాల్గొంటానని ట్రంప్ చెప్పినట్లు తెలుస్తోంది. ట్రంప్ రెచ్చగొట్టే వ్యాఖ్యలతోనే ఆయన మద్దతుదారులు కేపిటల్ హిల్ వైపు పరుగులు తీశారని చెబుతున్నారు.
ట్రంప్ ప్రసంగం చేసిన గంట తర్వాత వేలాదిగా ఆయన మద్దతుదారులు చట్టసభల వైపు దూసుకొచ్చారు. పోలీసులతో ఘర్షణకు దిగారు. బారికేడ్లను తోసుకొచ్చారు. ఈ ఘర్షణల్లో పోలీసులకు కూడా గాయాలు అయ్యాయి. అయితే భారీగా ఆందోళనకారులను చూసిన పోలీసులు వెంటనే మరిన్ని బలగాలు కావాలని కోరాయి. ఈ సమయంలో కేపిటల్ హిల్ సమీపంలో బాంబుల కలకలం రేగింది. ఆర్‌ఎన్‌సీ, డీఎన్‌సీ ప్రధాన కార్యాలయాల్లో బాంబులు దొరికాయి. ఐఈడీ, పైప్ బాంబులను గుర్తించారు. వెంటనే వాటిని నిర్వీర్యం చేశారు. అప్పటికే ట్రంప్ మద్దతుదారులు కేపిటల్ హిల్ దగ్గరికి చేరుకున్నారు.
అంతటితో ట్రంప్ మద్దతుదారుల విధ్వంసం ఆగలేదు. భారీ స్థాయిలో ఆందోళనకారులు రావడంతో వారిని అడ్డుకోవడం కూడా కష్టంగా మారింది. దీంతో ట్రంప్ మద్దతుదారులు కేపిటల్ హిల్ భవనం కిటీకీలు బద్ధలు కొట్టి.. లోపలికి దూసుకెళ్లారు. అక్కడ నానా యాగీ చేశారు. కాంగ్రెస్‌మెన్‌ల ఆఫీసుల్లోకి దూసుకెళ్లి కూర్చీలపై ఫోజులిచ్చారు. అయితే ఆందోళనకారులు వచ్చేలోపే అమెరికా కాంగ్రెస్ సభ్యులను అక్కడి నుంచి అధికారులు తరలించారు .
ఆయుధాలతో దూసుకొచ్చిన ట్రంప్ మద్దతుదారులను తరిమికొట్టేందుకు నాలుగు గంటల పట్టింది. అప్పటికే భారీగా చేరుకున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించారు. బ్యాలెట్‌లను సురక్షిత ప్రాంతానికి తరలించారు. అయితే అప్పటికే జరగాల్సిన విధ్వంసం జరిగిపోయింది. అమెరికా ప్రజాస్వామ్యంపై చెరగని మచ్చ పడిపోయింది. సఈ ఘటనకు ట్రంప్ కారణమంటూ అటు డెమొక్రాట్లు, ఇటు రిపబ్లికన్లు మండిపడుతున్నారు. ఇదంతా ట్రంప్ పాపమేనంటున్నారు.