రె’ఢీ’అన్న జానారెడ్డి..సాగర్‌లో టీఆర్‌ఎస్‌, బీజేపీ వంతు ఎప్పుడు ?

-

నాగార్జునసాగర్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి ఎవరో తేలిపోయారు.మరి టీఆర్‌ఎస్‌, బీజేపీ పరిస్థితి ఏంటి ? జానారెడ్డిని ఢీకొట్టేందుకు ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లబోతున్నాయి…ఉపఎన్నిక షెడ్యూల్‌ రాకుండానే సాగర్‌లో అభ్యర్థిని ఖరారు చేసుకుని గేర్‌ మార్చింది కాంగ్రెస్‌. మరి.. టీఆర్‌ఎస్‌, బీజేపీ వంతు ఎప్పుడన్నది ఉత్కంఠ రేపుతోంది.

 

నాగార్జునసాగర్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణం తర్వాత అన్ని పార్టీల దృష్టి మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్ నేత జానారెడ్డిపైనే పడింది. తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిణామాలతో ఆయన కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తారా లేక.. టీఆర్‌ఎస్‌, బీజేపీల నుంచి బరిలో ఉంటారా అన్న చర్చ పీక్‌కు వెళ్లింది. కానీ.. అలాంటి ప్రచారానికి జానారెడ్డి చెక్‌ పెడితే.. ఇప్పుడు ఏఐసీసీ కూడా క్లారిటీ ఇచ్చేసింది. నాగార్జునసాగర్‌ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ నుంచి జానారెడ్డి బరిలో ఉంటారని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్యం ఠాగూర్‌ స్పష్టం చేశారు.

నాగార్జునసాగర్‌తో పాటు పునర్విభజనకు ముందు చలకుర్తి నియోజకవర్గంగా ఉన్నా ఈ ప్రాంతంలో మొత్తం పదిసార్లు పోటీ చేశారు జానారెడ్డి. చలకుర్తి నియోజకవర్గంలో ఆయన ఏడుసార్లు గెలిచారు. ఇప్పుడు ఉపఎన్నిక బరిలో దిగాలని డిసైడైన తర్వాత నియోజకవర్గంలో ఆయన విస్తృతంగా పర్యటిస్తున్నారు. మరి.. సిట్టింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి టీఆర్‌ఎస్‌ ఏం చేస్తుందన్నదే ఆసక్తిగా ఉంది. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల ఫలితాల తర్వాత ఛాన్స్‌ తీసుకోవడానికి ఇష్టపడటం లేదు అధికార పార్టీ. నోముల నర్సింహయ్య కుటుంబానికి టికెట్‌ ఇస్తుందా లేక వేరెవరినైనా బరిలో దించుతుందా అన్నది ఇంకా తేలలేదు.

జానారెడ్డిని ఎదుర్కోవాలంటే ఎలాంటి వ్యూహంతో వెళ్లాలి అనే అంశాలపై సర్వేలు, రీసర్వేలు చేయిస్తున్నాయట టీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలు. టీఆర్‌ఎస్‌ నుంచి బరిలో దిగేందుకు చాలా మంది ఆసక్తితో ఉన్నారు. అయితే సామాజిక సమీకరణాల లెక్కతోపాటు దుబ్బాకలో జరిగిన పొరపాట్లు రిపీట్‌ కాకుండా అడుగు ముందుకెలా వేయాలన్నదే టీఆర్‌ఎస్‌ ముందు ఉన్న ప్రశ్న. ఇక్కడ గెలిచి 2023 ఎన్నికలకు కొత్త ఊపిరి ఊదాలని కాంగ్రెస్‌ భావిస్తుంటే.. దుబ్బాక, ఎన్నికల చేదు ఫలితాల నుంచి గట్టెక్కాలన్నది టీఆర్‌ఎస్‌ ఆలోచన. అందుకే ఈ రెండు పార్టీలకు ఉపఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది.

ఇక బీజేపీ ముందు నాగార్జునసాగర్‌లో అనేక సవాళ్లు ఉన్నాయి. దుబ్బాక కంటే ఎక్కువ శక్తి కూడదీసుకుని ఇక్కడ పోరాటం చేయాలి. ఒకవైపు అధికార పార్టీని.. మరోవైపు జానారెడ్డిని ఎదుర్కొంటూనే బలం చాటుకోవాలి కమలనాథులు. ఈ ఉపఎన్నికలో అభ్యర్థి ఎంపికే బీజేపీకి కీలకం కానుంది. కనీసం జానారెడ్డి కుమారుడు రఘువీర్‌రెడ్డిని బీజేపీలోకి తీసుకొచ్చి పోటీ చేయించాలని అనుకున్నారు. కానీ అవేమీ వర్కవుట్‌ కాలేదు. టీఆర్‌ఎస్‌లో టికెట్‌ ఆశించి భంగపడేవారు ఎవరికైనా గాలం వేస్తారా లేక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని యాదవ సామాజికవర్గానికి చెందిన వారిని బరిలో దించుతారా అన్నది ఆసక్తిగా ఉంది.

త్రిముఖపోటీలో ఓట్లు చీలతాయని.. ఆ మేరకు ఎన్నికల వ్యూహం రచించాలని ఆలోచిస్తున్నారట కమలనాథులు. మరి జానారెడ్డిని ఎదుర్కొనేందుకు టీఆర్‌ఎస్‌, బీజేపీలు ఎలాంటి అస్త్రాలును సంధిస్తాయో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news