ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ మొదలవగానే ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగాన్ని మొదలుపెట్టారు. ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్ష కోసం సీఎం జగన్ పాలన కొనసాగుతుందన్నారు. అయితే గవర్నర్ ప్రసంగం మధ్యలోనే టిడిపి సభ్యులు సభ నుంచి వాకౌట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం గవర్నర్ ప్రసంగంపై అసంతృప్తి వ్యక్తం చేశారు టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్.
గవర్నర్ ప్రసంగంలో మూడు రాజధానులు అంశం ఎందుకు లేదని ప్రశ్నించారు. సుప్రీం పరిధిలో ఉన్న రాజధాని అంశంపై బహిరంగ ప్రసంగాలు చేసిన ప్రభుత్వం, గవర్నర్ ప్రసంగంలో ఎందుకు పెట్టలేదని నిలదీశారు. పాత గవర్నర్ ని తాకట్టు పెట్టిన ప్రభుత్వం.. ప్రస్తుత గవర్నర్ స్థాయిని తగ్గించారని ఆరోపించారు. గవర్నర్ తో ముఖ్యమంత్రిని పొగిడించడం ఏమిటని? మండిపడ్డారు. రాష్ట్రానికి గవర్నర్ పెద్దా? లేక ముఖ్యమంత్రి పెద్దా? అని ఎద్దేవా చేశారు. గవర్నర్ ని కూడా స్పీకర్ కార్యాలయంలో వేచి ఉండేలా చేశారని అన్నారు పయ్యావుల కేశవ్.