అనుభవం ఉన్న నాయకుడికి, అదే అనుభవం లేని నాయకుడికి మధ్య తేడా చెప్పమంటే.. ఎదురుదాడి ఒక్కటే తేడా అంటారు రాజకీయ విశ్లేషకులు. రాజకీయాల్లో అపార అనుభవం ఉన్న వ్యక్తి.. తనపై ఆరోపణలు వచ్చినప్పుడు ససాక్ష్యాలతో వాటిలో తన తప్పు లేదని నిరూపించే ప్రయత్నం చేస్తారు. కానీ, అనుభవం లేని నాయకుడు మాత్రం ఎదురు దాడికి దిగుతాడు! మరి తనకు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనుభవం ఉందని పదే పదే చెప్పుకొనే చంద్రబాబు ఇప్పుడు అనుభవం లేని నాయకుడు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారని అంటున్నారు పరిశీలకులు.
ప్రస్తుతం ఆయనపైనా, ఆయన ఐదేళ్ల పాలనలో జరిగిన తప్పులు, అవకతవక లపైనా ప్రస్తుత జగన్ ప్రభుత్వం కన్నెర్ర చేస్తోంది. చంద్రబాబు అవకతవకలను ప్రజా సమక్షంలో పెట్టి ఆయనను నిలువునా నిలదీసేందుకు రెడీ అయింది. ఈ క్రమంలో గడిచిన చంద్రబాబు ఐదేళ్ల పాలనలో జరిగిన లోపాలను గుర్తించేందుకు మంత్రి వర్గ ఉపసంఘం నియమించిన జగన్.. ఈ సంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రత్యక దర్యాప్తు బృందాన్ని నియమించింది. దీనిలో అందరూ పోలీసులే ఉన్నారు.
వాస్తవానికి చంద్రబాబు వంటి కీలక నాయకుడిపై జగన్ వంటి అనుభవం లేని(టీడీపీ చెబుతున్న దాని ప్రకారం) నాయకుడు దర్యాప్తు చేయడం దేశంలోనే తొలిసారి అవుతుంది. అలాంటి నాయకుడిపై దర్యాప్తు అంటే ఆషామాషీ కాదు. దీనికి కేంద్రంలోని పెద్దల అండదండలు పుష్కలంగా జగన్‌కు ఉన్నాయని అంటున్నారు. ఈ విషయాన్ని ఇటీవల ఢిల్లీ పర్యటనలో జగన్ ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షాలకు కూడా వివరించారని తెలుస్తోంది. వారి నుంచి పూర్తిస్థాయిలో గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతే.. చంద్రబాబుపై సిట్ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో తనపై జగన్ ప్రభుత్వం కేవలం 10 మాసాల్లోనే ఇంత తీవ్ర నిర్ణయం తీసుకుంటే.. దీనిలోతుపాతులు గుర్తించకుం డానే చంద్రబాబు ఎదురుదాడికి దిగుతుండడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. జగన్మోహన్ రెడ్డి ఏమన్నా చేసుకోవచ్చు నని, దిక్కున్నచోట చెప్పుకోమన్నానని చంద్రబాబు అనడం రాజకీయంగా ఈ విషయాన్ని మరింతగా వివాదంలోకి నెడుతోంది. జగన్ ఏర్పాటు చేసిన సిట్‌పై స్పందించిన ఆయన జగన్ మాదిరిగా తాను ఏ తప్పు చేయలేదని అన్నారు. బెదిరింపులకు ఇక్కడ భయపడేవారు ఎవరూ లేరని, గత ఏడు నెలలుగా ఇదే మాట చెబుతున్నారని మండిపడ్డారు.
జగన్ తప్పులు చేసి ఇరుక్కుపోయారని, రాత్రులు నిద్ర లేని పరిస్థితి వస్తుందని, జగన్ వల్ల ఏమీ కాదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అయితే, వాస్తవానికి చంద్రబాబు ఇలా ఎదురు దాడికాకుండా నిజానిజాలు వెల్లడించి ఉంటే.. తన అనుభవాన్ని తాను కాపాడుకుని ఉండేవారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదేసమయంలో ప్రభుత్వ దూకుడును కూడా ఆయన ప్రజల్లో ఎండగట్టి ఉంటే బాగుండేదని అంటున్నారు. అలా కాకుండా ఎదురుదాడే వ్యూహం అన్నట్టుగా వ్యవహరించడం ఆయనకు, పార్టీకి కూడా మంచిది కాదని చెబుతున్నారు.