జపాన్ వేదికగా టోక్యో నగరంలో ఒలింపిక్స్ గేమ్స్ జరుగుతున్న సంగతి తెలిసిందే. గత సంవత్సరం జరగాల్సిన ఈ ఆటలు కరోనా కారణంగా ఒక సంవత్సరం ఆలస్యంగా జరుగుతున్నాయి. ఐతే తాజాగా ఒలింపిక్స్ గేమ్స్ లో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. చాలామంది అథ్లెట్స్ శరీరాలపై కొన్ని నల్లమచ్చలు కనిపించాయి. అవి ఎందుకు ఉన్నాయనే సందేహం అందరికీ కలిగింది. కోడిగుడ్డు ఆకారంలో ఉన్న మచ్చలు ఎందుకు అనేది అందరికీ కలిగిన అనుమానం.
ఆస్ట్రేలియా స్విమ్మర్ కైల్ చామర్స్, జపనీస్ స్విమ్మర్ అకిరా నంబా మొదలగు వారు ఈ మచ్చలతో కనిపించారు. గత ఒలింపిక్స్ లో అమెరికా స్విమ్మర్ మైఖేల్ ఫెల్ఫ్స్ కూడా ఇలాంటి మచ్చలతో కనిపించాడు. మరి దీనివెనక ఏదైనా అర్థం అందా అన్న విషయంలో వెబ్ ఎండీ ప్రచురించిన దాని ప్రకారం, ఇదొక థెరపీ. కప్పింగ్ అని పిలవబడే ఈ థెరపీని ప్రాచీన కాలం నుండి ఉపయోగిస్తున్నారు. మిడిల్ ఈస్ట్, ఆసియా ప్రాంతాల్లో చాలామందికి తెలిసినది. కప్పులను వేడి చేసి వాటిని శరీర భాగాల మీద ఉంచుతారు. చైనాలో దశాబ్దాల కాలం నుండి ఈ థెరపీని వాడుతున్నారు.
ఇది రెండు రకాలుగా ఉంటుంది. పొడి, తడి. ఈ రెండు పద్దతుల్లోనూ వేడి వేడి పదార్థాలతో కూడిన ఆల్కహాల్, మూలికలు మొదలైన వాటిని కప్పులో పోసి చర్మం మీద ఉంచుతారు. అ తర్వాత యాంటీబయాటిక్ రాసి, బ్యాండేజీ వేస్తారు.
ఈ థెరపీని ఎందుకు వాడతారు?
నొప్పులను తగ్గించడానికి. అవును, శరీర నొప్పులను తగ్గించడానికి ఈ థెరపీ ఉపయోగపడుతుంది. దీనివల్ల రక్తప్రసరణ తీరు మెరుగుపడుతుందని భావన. ఇంకా, అనవసర పదార్థాల నుండి చర్మాన్ని శుద్ధి చేయడానికి, కాలేయ ఇబ్బందులను దూరం చేయడానికి, ప్లీహ సంబంధ సమస్యలను దూరం చేయడానికి ఈ థెరపీ పనిచేస్తుందని నమ్మకం.