జనసేన అధినేత, స్టార్ హీరో పవన్‌కల్యాణ్‌ని కన్నడ హీరో సుదీప్ ప్రత్యేకంగా కలవడం ప్రధాన్యతను సంతరించుకుంది. సోమవారం హైదరాబాద్‌లోని జనసేన కార్యాలయంలో సుదీప్ ప్రత్యేకంగా పవన్‌కల్యాణ్‌ని కలిశారు. దీంతో వీరిద్దరి మధ్య సమకాలీన రాజకీయాలపై చర్చ జరిగి వుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. కర్ణాటకలో సుదీప్ బీజేపీకి సపోర్ట్‌గా నిలుస్తున్న విషయం తెలిసిందే.
ఇటీవల కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి అండగా నిలిచి సుదీప్ ప్రచారం కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణల్లో బిజేపీకి సపోర్ట్ చేస్తున్న జనసేన అధినేతని సుదీప్ ప్రత్యేకంగా కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రానున్న రోజుల్లో బిజేపీకి ఎలా అండగా నిలవాలన్నదానిపై ఈ హీరోల మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. కానీ పీఆర్ టీమ్ మాత్రం సుదీప్ మర్యాద పూర్వకంగానే జనసేన అధినేతని కలిశారని చెబుతోంది. సుమారు గంట సేపు వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్టు తెలిసింది.
సినిమాల గురించి మాత్రమే వీరిద్దరి మధ్య చర్చ జరిగిందని, కోవిడ్ నిబంధనలను అనుసరించి చేస్తున్న షూటింగ్‌ల గురించి మాట్లాడుకున్నారని వర్తమాన, సామాజిక అంశాలపై తమ ఆలోచనల్ని పవన్, సుదీప్ పంచుకున్నారని మాత్రమే మీడియాకు వెల్లడించారు.