ఆసియా కప్ లో భాగంగా ఇవాళ టీమిండియా మరియు పాకిస్తాన్ జట్ల మధ్య కీలక పోరు జరగనుంది. ఈ మ్యాచ్ దుబాయ్ లోని ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ పై జోరుగా బెట్టింగ్ కొనసాగుతోంది.
ఇది ఇలా ఉండగా.. దాయాదుల సమరం ప్రారంభానికి కొద్ది గంటల ముందు శ్రీనగర్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యాజమాన్యం జారీ చేసినట్లు చెబుతున్న కొన్ని వివాదాస్పద ఆంక్షలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. పలు మాధ్యమాల ద్వారా అందిన వివరాల మేరకు, ఎన్.ఐ.టి విద్యార్థులు ఇవాళ జరిగే భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్ ను వీక్షిస్తే కఠిన చర్యలు తప్పవని యాజమాన్యం హెచ్చరించినట్లు తెలుస్తోంది.
విద్యార్థులు హాస్టల్ గదుల్లో గుంపులుగా చేరి మ్యాచ్ ను చూసిన, మ్యాచ్ కు సంబంధించి సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టిన, సంబంధిత విద్యార్థులను హాస్టల్ గది ఖాళీ చేయించడంతోపాటు రూ.5000 జరిమానా విధిస్తామని కళాశాల డీన్ హెచ్చరించినట్లు సమాచారం. మ్యాచ్ సమయంలో విద్యార్థులంతా తమ తమ గదుల్లోనే ఉండాలని, అలా కాకుండా యాజమాన్యం హెచ్చరికలను ధిక్కరిస్తే కఠిన చర్యలు తప్పవని నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.