గత రెండు మూడు రోజులుగా తెలుగు సినిమాల నుండి వరుస పెట్టి రిలీజ్ డేట్ల ప్రకటనలు వస్తున్నాయి. ఒకరిని మించి మరొకరు అన్నట్టుగా వరుసగా రిలీజ్ డేట్లు ప్రకటించుకుంటూ పోయారు. అది కూడా సడెన్ గా వెల్లడి చేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ డేట్ ప్రకటించినప్పటి నుండి వరుసగా వస్తున్న అప్డేట్ల వెనక ఒక విషయం దాగి ఉంది. సినిమాలన్నింటినీ తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ రిలీజ్ చేయడమే దానికి కారణం అని తెలుస్తుంది.
ముఖ్యంగా హిందిలోనూ రిలీజ్ చేస్తున్నారు కాబట్టి రిలీజ్ డేట్ ని తొందరగా లాక్ చేసుకోవాలని భావిస్తున్నారట. అక్కడ పెద్ద సినిమాల తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అంత అర్జెంటుగా రిలీజ్ డేట్లని ప్రకటించారు. అల్లు అర్జున్ పుష్ప ఆగస్టు 13వ తేదీన, ఆర్ ఆర్ ఆర్ అక్టోబర్ 13వ తేదీన, ఎఫ్ 3 ఆగస్టు 27వ తేదీన విడుదల అవుతున్నాయి. ఇంకా పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ విడుదల తేదీ ప్రకటన రానప్పటికీ ఏప్రిల్ 9వ తేదీన అని గట్టిగా ప్రచారం జరుగుతోంది. మొత్తానికి టాలీవుడ్ కి ఇది రిలీజ్ డేట్ల ప్రకటన నెలగా చెప్పుకోవచ్చు.