హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన ఉపఎన్నికలో ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ భార్య కమలేష్ ఠాకూర్ సత్తా చాటారు. కాంగ్రెస్ తరఫున డెహ్రా నియోజకవర్గం నుంచి బరిలో దిగిన కమలేష్ ఠాకూర్ ఉపఎన్నికలో విజయం సాధించారు. తొలిసారి ఎన్నికల బరిలో దిగిన ఆమె.. బీజేపీ అభ్యర్థి హోషియార్ సింగ్ ని ఓడించారు. మొత్తం 9 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. మరోవైపు హిమాచల్ ప్రదేశ్ లోని మూడు స్థానాలకు ఉపఎన్నిక జరగగా.. కాంగ్రెస్ రెండు చోట్ల, బీజేపీ ఒక చోట విజయం సాధించింది.
నలాగఢ్ స్థానం నుంచి కాంగ్రెస్ నేత హర్దీప్ బవా విజయదుందుభి మోగించారు. బీజేపీ అభ్యర్థి కేఎల్ ఠాకూర్ పై 8,990 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇకపోతే, హమీర్ పూర్ లో కాంగ్రెస్, బీజేపీ మధ్య టఫ్ పైట్ జరిగింది. బీజేపీ అభ్యర్థి ఆశిష్ శర్మ.. కాంగ్రెస్ అభ్యర్థి పుష్పేందర్ వర్మపై గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థిపై 1,571 ఓట్ల మెజార్టీతో ఆశిష్ శర్మ గెలుపొందారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి గట్టిపోటీనిచ్చిన ఇండియా కూటమి ఏడు రాష్ట్రాల్లో జరిగిన 13 ఉపఎన్నికల్లోనూ సత్తా చాటడం విశేషం.