జానారెడ్డి డిమాండ్లకు బీజేపీ,టీఆర్ఎస్ కమిట్‌ అవుతాయా ?

-

తెలంగాణలో ప్రస్తుత రాజకీయాలు మాజీ మంత్రి జానారెడ్డి చుట్టూ తిరుగుతున్నాయి. టీఆర్‌ఎస్‌, బీజేపీలు ఆయనతో సంప్రదింపులు చేస్తున్నాయి. ఈ సందర్భంగా జానారెడ్డి రెండు పార్టీల ముందు వేర్వేరు డిమాండ్లు పెట్టారట. వాటిపై రాజకీయ వర్గాల్లో ఓ రేంజ్‌లో చర్చ జరుగుతోంది. ఇంతకీ జానారెడ్డి ఈ ఆఫర్లకు కమిట్ అవుతారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి జానారెడ్డికి ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగింది. నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతో రాబోయే ఉపఎన్నికను దృష్టిలో పెట్టుకుని జానాపై ఆకర్షణ వల విసిరేందుకు టీఆర్‌ఎస్‌, బీజేపీ పోటీపడుతున్నాయి. నిన్న మొన్నటి వరకు కేరళలో ఉన్న ఆయనతో రెండు పార్టీల నాయకులు ఫోన్ల ద్వారా ఎడతెగని మంతనాలు చేశారు. ఇప్పుడు జానారెడ్డి సిటీలోకి ఎంట్రీ ఇవ్వడంతో ఈ మంతనాలు, మంత్రాంగాలు ఊపందుకున్నాయి.

టీఆర్‌ఎస్‌ ముఖ్యనేత ఒకరు నేరుగా జానారెడ్డితో ఫోన్‌లో మాట్లాడినట్టు తెలుస్తోంది. జానారెడ్డి సభలో విపక్ష నేతగాఉన్న సమయంలో పెద్దలు జానారెడ్డి అని సీఎం కేసీఆర్‌ గౌరవంగా సంబోధించేవారు. ప్రస్తుతం జరుగుతున్న చర్చల్లో అది కూడా ప్రస్తావనకు వస్తోందట. పైగా సీఎం కేసీఆర్‌తో జానాకు మంచి సంబంధాలే ఉన్నాయని చెబుతున్నారు. బీజేపీ నాయకులు కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదట. మీరు పోటీ చేయడానికి ఆసక్తి లేకపోతే మీ కుమారుడు రఘువీర్‌రెడ్డికి టికెట్‌ ఇస్తాం.. సపోర్ట్‌ చేయండి చాలు అని సూచించారట. అయితే పెద్దాయన మాత్రం ఎవరి దగ్గర కమిట్‌ కాలేదని తెలుస్తోంది.

టీఆర్‌ఎస్‌, బీజేపీల నుంచి వచ్చిన ఆఫర్లను ఆలకించిన తర్వాత మాజీ మంత్రి జానారెడ్డి తన మనసులో మాటను ఆయా పార్టీల నేతల దగ్గర బయటపెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. తన కుమారుడు రఘువీర్‌రెడ్డిని ఎమ్మెల్యేగా బరిలో దించుతా.. తనకు మాత్రం రాజ్యసభ కావాలని టీఆర్‌ఎస్‌ నేతల దగ్గర జానా ప్రస్తావించినట్టు తెలుస్తోంది. పైగా ఈ అంశంపై సీఎం కేసీఆర్‌ నుంచి ఆయన హామీ కోరుతున్నారట. ఇదే విధంగా బీజేపీ నేతల దగ్గర జానారెడ్డి మరో ప్రస్తావన చేశారట. రఘువీర్‌రెడ్డిని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయిస్తా.. తనను మాత్రం గవర్నర్‌ను చేయాలని కమలనాథుల దగ్గర అన్నారట.

జానారెడ్డి నుంచి వచ్చిన ఈ ఆఫర్‌ విన్న తర్వాత టీఆర్‌ఎస్‌, బీజేపీల్లో అంతర్గతంగా చర్చ జరుగుతోందట. ఇదే సమయంలో మరో ప్రచారం కూడా చర్చలో ఉంది. తాను కాంగ్రెస్‌లోనే ఉంటానని.. కాంగ్రెస్‌ నుంచే పోటీ చేస్తానని ఆయా పార్టీల నేతలకు జానారెడ్డి స్పష్టం చేశారని సమాచారం. పైగా.. మీరే తనకు సహకరించాలని టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలను ఎదురు కోరారని చెబుతున్నారు. దీనికి టీఆర్‌ఎస్‌ ఒప్పుకుంటుందా అన్న ప్రశ్న వినిపిస్తోంది.

తెలంగాణలో కొన్ని పార్టీలు ఉండకూదని కోరుకున్న టీఆర్‌ఎస్‌.. ఆ దిశగా టీడీపీని ఉనికి లేకుండా చేసింది. తర్వాత కాంగ్రెస్‌పై ఫోకస్‌ పెట్టింది. కానీ.. బీజేపీ బలపడకుండా అడ్డుకోవాలంటే రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఉండాలని గులాబీ నేతలు కోరుకుంటున్నారట. అందుకే నాగార్జునసాగర్‌లో టీఆర్‌ఎస్‌ వీక్‌ అభ్యర్ధిని బరిలో దించి.. పరోక్షంగా జానారెడ్డికి సహకరించొచ్చనే వాదన నడుస్తోంది. సీఎం కేసీఆర్‌తో సన్నిహితంగా ఉండేవారు మాత్రం.. ఈ రాజకీయ ఎత్తుగడకు గులాబీ దళపతి ఒప్పుకోకపోవచ్చని అనుకుంటున్నారు. నాగార్జునసాగర్‌ సిట్టింగ్‌ స్థానాన్ని టీఆర్‌ఎస్‌ నిలబెట్టుకుంటుందని చెబుతున్నారు.

జానారెడ్డి డిమాండ్లు విన్న తర్వాత టీఆర్‌ఎస్‌, బీజేపీలు ప్రత్యామ్నాయాలను కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. మరి.. జానారెడ్డి చుట్టూ జరుగుతున్న ఈ చర్చ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news