ఆంధ్ర ప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా ఇచ్చిన హామీలపై చర్చించేందుకు తెలుగు ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఈనెల ఆరవ తేదీన భేటీ అయ్యేందుకు ముహూర్తం ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ సమావేశం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో జరగనుంది.అయితే చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి భేటీపై తెలంగాణ బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు ముఖ్యమంత్రులు కలవాలని తాము కోరుకుంటున్నామని, కానీ వారిద్దరి భేటీ ఏ క్షణంలోనైనా రద్దు కావొచ్చని ఎన్వీఎస్ ప్రభాకర్ వెల్లడించారు.
విభజన చట్టంలోని హామీలు ఇద్దరు ముఖ్యమంత్రులు చొరవ తీసుకుని ముందుకు వెళ్తే మంచిదేనని, అయితే చంద్రబాబు, రేవంత్ రెడ్డి మీటింగ్‌కు కాంగ్రెస్ అధిష్టానం నుంచి పర్మిషన్ ఉందా అని ఆయన ప్రశ్నించారు. అసలు ఆ మీటింగ్ జరుగుతుందా అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఏదో ఒక కారణం చెప్పి చంద్రబాబు, రేవంత్ రెడ్డి మీటింగ్‌ను కాంగ్రెస్ అధిష్టానం ఆపివేసే అవకాశాలున్నాయని తెలంగాణ బీజేపీ నేత ఎస్వీఎస్ఎస్ ప్రభాకర్ తెలిపారు.