బుజ్జిగాడు , గబ్బర్ సింగ్ వంటి చిత్రాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించిన ఆకాష్ పూరీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఈ కుర్రాడు మెహబూబా అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. అయితే మొదటి సినిమాతోనే హీరోగా ప్రేక్షకులను మెప్పించలేకపోయారు. దీంతో తన తండ్రి పూరీ జగన్నాథ్ స్వయంగా బాధ్యతలు తీసుకొని రొమాంటిక్ సినిమాను తెరకెక్కించారు. ఇక ఈ సినిమాతో కూడా ఆకాష్ విజయాన్ని సొంతం చేసుకోలేక పోవడం గమనార్హం.ఇక ఇదిలా ఉండగా తాజాగా ఆకాష్ మరొకసారి చోర్ బజార్ అనే సినిమాతో జూన్ 24వ తేదీన థియేటర్లో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న ఆకాష్ తన వ్యక్తిగత విషయాల గురించి అలాగే తమ తల్లిదండ్రుల గురించి కూడా ఎన్నో విషయాలను వెల్లడించారు. ఇకపోతే ప్రమోషన్స్లో భాగంగా ఆకాష్ నటనపై, సినీ ఇండస్ట్రీ పై తనకున్న మక్కువను ఈ విధంగా తెలిపారు.
ఆకాష్ మాట్లాడుతూ..చిన్నప్పటి నుంచి నాకు సినిమా అంటే పిచ్చి. ఏదేమైనా పరిశ్రమలోనే ఉండాలని నిర్ణయించుకున్నాను. ముఖ్యంగా పదవ తరగతి లోని చదువు మానేసి పరిశ్రమలోకి వెళ్ళిపోతాను అని ఇంట్లో చెప్పాను.. కానీ అమ్మ కంగారు పడిపోయి.. భయపడిపోయింది. ఇకపోతే ఒకసారి స్కూల్లో మా టీచర్లు కూడా పెద్దయ్యాక ఏమవుతావని అడగగా. నటుడిని అవుతాను అని చెప్పాను. దానికి ఆయన నటుడిగా సక్సెస్ కాకపోతే ఏం చేస్తావ్ అని ప్రశ్నించగా.. నటుడిగా ఫెయిల్ అయితే దర్శకుడిగా వెళ్తాను .. అక్కడ కూడా ఫెయిల్ అయితే స్టంట్ మాస్టర్ అవుతానని.. అది కూడా ఫెయిల్ అయితే కొరియోగ్రాఫర్ అవుతానని.. అది కూడా ఫెయిల్ అయితే అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తానని.. చివరికి ఏదీ చేయకపోతే లైట్ బాయ్ గా అయినా పని చేస్తాను సార్ అని సమాధానం చెప్పానని తెలిపారుఆకాష్. ఇక మొత్తానికి అయితే సినీ ఇండస్ట్రీ పై తనకున్న మక్కువను తెలియజేశారు ఆకాష్.