రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉత్కంఠకు తెరదీసిన.. తెలంగాణలోని సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్ కౌంటింగ్ నువ్వా-నేనా అనే రేంజ్‌లో సాగింది. అధికార టీఆర్ఎస్ తమకు ఏకపక్ష విజయమని ప్రకటించినా.. బీజేపీ దూకుడు ముందు.. నిలవలేక పోయింది. తెలంగాణ జాతి పితగా తనను తాను ప్రొజెక్టు చేసుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చిన కేసీఆర్.. ఇప్పుడు ఆ తరహా వ్యూహంతో ముందుకు సాగే పరిస్థితి కనిపించడం లేదు. అంతేకాదు, రైతుల విషయంలోను, ఉద్యోగాల అంశంలోనూ, యువత విషయంలోనూ సీఎం కేసీఆర్ అనుసరించిన విధానంపై ప్రజలు గుర్రుగా ఉన్నారు.
అదే సమయంలో కరోనా నియంత్రణ, ప్రజలను ఆదుకునే విషయంలోనూ ఆయన వెనుకబడ్డారనే వాదన బలంగా ఉంది. ఇక, సరైన ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నట్టుగా దుబ్బాక ప్రజాతీర్పు ఉత్కంఠగా సాగింది. ఈ ఉప ఎన్నికను కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గెలుపు మాదేనని ధీమా వ్యక్తం చేశారు. కానీ, ఇప్పుడు ప్రజాతీర్పు మాత్రం దాగుడు మూతలు ఆడి బీజేపీకి అనుకూలంగా వచ్చింది. ఈ ఫలితం సహజంగానే టీఆర్ఎస్ నేతల్లో గుబులు పుట్టిస్తోంది.
ఇక, దుబ్బాక ఉప పోరులో టీఆర్ఎస్ పరాజయం సీఎం కేసీఆర్‌కు అనేక పాఠాలు నేర్పుతోంది. రాష్ట్రంలో ప్రజారంజక పాలన అందిస్తున్నామని ఆయన చెబుతున్నా.. ఆ తరహాలో మాత్రం సాగడం లేదనే విషయాన్నిఈ ఎన్నిక ఫలితం రుజువు చేస్తోంది. కేసీఆర్ చెప్పిందే నిజమైతే.. సింపతీ కలగలిపి ఏకపక్షంగా క్లీన్ స్వీప్ చేసేయాలి. అలాంటి పరిస్థితి కనిపించడం లేదు.
అదే సమయంలో కేసీఆర్‌కు సరైన ప్రత్యామ్నాయం ఉంటే.. ఆయనను పక్కన పెట్టడం కూడా ఖాయమనే సంకేతాలను ఈ ఉప ఎన్నిక ఫలితం స్పష్టం చేసింది. తెలంగాణ ప్రజలు హర్షిస్తే ఎంత నెత్తినె పెట్టుకుంటారో నియంతృత్వానికి అంతేలా పీచమణుస్తారనడానికి దుబ్బాకే నిదర్శనం అని రాజకీయ విశ్లేషకులు కూడా చెపుతున్నారు. సో.. దీనిని బట్టి.. కేసీఆర్ తన వ్యూహాలను సరిచేసుకోవాలని.. ఆయన ఏకపక్ష తీరు మార్చుకోవాలనేది పరిశీలకుల మాట. మరి ఏం చేస్తారో చూడాలి.