రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే, యువ నాయకురాలు.. ఆదిరెడ్డి భవానీకి చెక్ పెడుతున్నారా? పార్టీలో మరో నేతను ఇక్కడ నుంచి డెవలప్ చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. తాజాగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే.. ఔననే సమాధానమే వస్తోంది. గత ఏడాది ఎన్నికల్లో రాజమండ్రి సిటీ, రూరల్ నియోజకవర్గాలు టీడీపీ కైవసం చేసుకుంది. వైసీపీ సునామీలోనూ ఇక్కడ నుంచి పోటీ చేసిన బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి భవానీలు గెలుపు గుర్రాలు ఎక్కారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. తన వారసుడిగా.. డాక్టర్ రవి కిరణ్‌ను రంగంలోకి దింపాలని అనుకున్న బుచ్చయ్య సిటీ నియోజకవర్గంపై కన్నేశారు.
గతంలో ఆయన ఇక్కడ నుంచి పోటీ చేసిన నేపథ్యంలో ఉన్న పరిచయాలను వాడుకుని కొన్నాళ్లుగా పార్టీ తరఫున ఇక్కడ కార్యక్రమాలకు హాజరు అవుతున్నారు. వారానికి రెండు మూడు సార్లు.. సిటీ నియోజకవర్గంలో పరిస్థితులను ఆయనే స్వయంగా సమీక్షిస్తున్నారు. మీడియా సమావేశాలు కూడా ఇక్కడే పెడుతున్నారు. దీంతో భవానీ వర్గం విషయాన్ని పసిగట్టి.. బుచ్చయ్య దూకుడు కళ్లెం వేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే వివాదానికి దారితీసింది.
బుచ్చయ్య హాజరయ్యే కార్యక్రమాలకు ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలను తొలగించడం, ఆయన కార్యక్రమాలకు హాజరు కాకుండా.. నిలువరించడం వంటివి చేస్తున్నారు. దీంతో బుచ్చయ్య దూకుడుకు దాదాపు బ్రేకులు పడ్డాయి. ఇదే విషయాన్ని తాజాగా ఆయన వెల్లడించారు. తన వారసుడిగా రవికిరణ్‌ను పరిచయం చేస్తూనే.. సిటీలో తనను అవమానిస్తున్నారంటూ.. విరుచుకుపడ్డారు. తన ఫ్లెక్సీలను చింపేస్తున్నారని.. తనకు ఆ మాత్రం గౌరవం కూడా ఇవ్వడం లేదని.. అన్నారు. అయితే, వాస్తవం ఇది కాదని.. తన సీటుకే ఎసరు పెట్టాలని బుచ్చయ్య ప్రయత్నిస్తున్నారని ఆదిరెడ్డి వర్గం ఆరోపిస్తోంది.
తొలిసారి రాజకీయాల్లోకి వచ్చిన కింజరాపు ఎర్రన్న కుమార్తె.. నిదానస్తురాలిగా పేరు తెచ్చుకుంది. అయితే, ఇక్కడ సీటు విషయంలో రాజకీయాలు జరుగుతుండడంతో ఇటీవలకాలంలో ఆదిరెడ్డి వర్గం కూడా దూకుడు పెంచింది. దీంతో రాజమండ్రి రాజకీయాలు టీడీపీలో హాట్ టాపిక్‌గా మారాయి. మరి ఇవి ఎటు దారితీస్తాయో చూడాలి.