రాష్ట్రంలో మళ్లీ మంత్రి పదవుల వ్యవహారం మరోసారి చర్చకు వచ్చింది. జగన్ కేబినెట్‌లో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. వీటి ని త్వరలోనే భర్తీ చేస్తారని అంటున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా సహా ఆన్‌లైన్ మీడియాల్లోనూ భారీ ఎత్తున వీరికి మంత్రి పదవులు ఖాయమని, వారికి తప్పకుండా ఇస్తారని ఊదరగొడుతున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన మోపిదేవి వెంకట రమణారావు.. రాజ్యసభకు ప్రమోట్ కావడంతో ఆయన స్థానంలో గుంటూరు జిల్లా నుంచే నేతను జగన్ ఎంపిక చేసి మంత్రి పీఠం ఇస్తారని అంటున్నారు. అంతేకాదు, మోపిదేవి బీసీ కావడంతోనే ఆ వర్గానికి చెందిన బీసీ నేతకే ఇస్తారని కొన్ని మీడియాల్లో ప్రచారం జరుగుతోంది.
దీనికి సంబంధించి బీసీ వర్గానికి చెందిన నేతలను ఉటంకిస్తూ.. వార్తలు వడ్డించేశారు. అయితే వైసీపీ వర్గాల్లో మాత్రం మరో విధమైన ప్రచారం జరుగుతోంది. ఎస్సీ వర్గానికి చెందిన డొక్కా మాణిక్య వరప్రసాద్‌కు జగన్ అవకాశం ఇస్తారని అంటున్నారు. అంతేకాదు, చంద్రబాబుకు ఝలక్ ఇచ్చేందుకు మోపిదేవి రాజీనామాతో భర్తీ అయిన స్థానాన్ని జిల్లా నుంచే భర్తీ చేసేందుకు ఎట్టి పరిస్థితిలో నూ డొక్కాకు ఛాన్స్ ఇస్తారని అంటున్నారు. దీనిపై రోజు రోజంతా కూడా ప్రచారంలోకి వచ్చింది. అదే సమయంలో మరో ఇద్దరు ముగ్గురు ఈ గుంటూరు జిల్లాకు చెందిన నేతల పేర్లనే తెరమీదికి తెచ్చారు. దీంతో అసలు డొక్కాకు మంత్రి పదవి దక్కుతుందన్నది పరిశీలిస్తే ఈ ఈక్వేషన్ కాస్త సంక్లిష్టంగానే కనపడుతోంది.
డొక్కా.. విషయాన్ని తీసుకుంటే.. రాజకీయంగా ఈయన సీనియరే అయినప్పటికీ.. వైసీపీలో ఈయన జూనియర్. పైగా.. గుంటూరు జిల్లాలోనే ఒక ఎస్సీ వర్గానికి చెందిన మహిళకు జగన్ అవకాశం ఇచ్చారు. ప్రత్తిపాడు నుంచి గెలిచిన మేకతోటి సుచరిత హోం మంత్రిగా ఉన్నారు. అదే సమయంలో ఇదే జిల్లాలో కీలక నాయకులు చాలా మంది మంత్రి పీఠం కోసం ఎదురు చూస్తున్నారు. వీరిలో జగన్‌కు అత్యంత ఆత్మీయులు, పార్టీకి కీలక నేతలు ఉన్నారు. దీంతో వీరిని కాదని జగన్ ఇటీవలే పార్టీలోకి వచ్చిన డొక్కాకు అవకాశం ఇచ్చే ఛాన్స్‌లేదనేది వాస్తవం.
ఇక, ఒకే జిల్లాలో ఇద్దరు ఎస్సీ వర్గానికి చెందిన నేతలకు మంత్రి పదవులు ఇవ్వడం, అందునా బీసీ నాయకుడు వేకేట్ చేయడం ద్వారా ఖాళీ అయ్యే పీఠాన్ని ఎస్సీ వర్గానికి ఇవ్వడం సాధ్యం కాదనేది వాస్తవం. కానీ, సదరు సోషల్ మీడియా మాత్రం డొక్కాకు మంత్రి పదవి అంటూ ప్రచారం మాత్రం జోరుగా జరుగుతోంది.