ఆస్కార్​ కోసం ఆర్ఆర్ఆర్ టీం అన్ని కోట్లు ఖర్చు చేస్తుందా?

-

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్‌ సినిమా భారీ వసూళ్లను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో డిజిటల్ ఫ్లాట్​ఫాం ద్వారా హాలీవుడ్ సినిమాను మించి వ్యూస్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఎంతో మంది ప్రముఖుల చేత ప్రశంసలు దక్కించుకున్న ఈ సినిమా ఇప్పుడు ఆస్కార్ బరిలో నిలిచేందుకు ఆరాటపడుతుంది.

మన దేశం తరఫున ఆస్కార్‌ పురస్కారాలకి పంపడానికి జ్యూరీ తిరస్కరించినప్పటికీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రబృందం తన ప్రయత్నాల్ని కొనసాగిస్తోంది. నేరుగా జనరల్‌ కేటగిరీలో దరఖాస్తు చేసుకుంది. ఆయా దేశాలకి చెందిన జ్యూరీ ఆమోదం లేనప్పటికీ, కొన్నిసార్లు సాధారణ కేటగిరీలో దరఖాస్తుల్ని పరిగణనలోకి తీసుకుంటుంది ఆస్కార్‌ కమిటీ. అలా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కి కూడా నామినేషన్లు దక్కే అవకాశాలున్నాయనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. ఓటీటీలో విడుదల తర్వాత సినిమాకి అంతర్జాతీయ స్థాయిలో విశేష ప్రశంసలు దక్కుతున్నాయి. పలువురు హాలీవుడ్‌ ప్రముఖులు సినిమాని మెచ్చుకుంటున్నారు. అక్కడి మీడియాలో కూడా ఈ సినిమాకి ఆస్కార్‌ ఖాయం అనే కథనాలొచ్చాయి.

అయితే భారతదేశం తరఫున జ్యూరీ గుజరాతీ చిత్రం ‘ఛెల్లో షో’ని ఈసారి అధికారిక ఎంట్రీగా పంపింది. దాంతో తెలుగు చిత్ర పరిశ్రమ వర్గాలు, అభిమానులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ బృందం చేస్తున్న తాజా ప్రయత్నాలతో మళ్లీ ఆస్కార్‌పై ఆశలు రేకెత్తుతున్నాయి. అయితే తాజాగా ఆస్కార్ కోసం భారీగానే ఖర్చు చేస్తున్నారట. దాదాపుగా 50 కోట్ల రూపాయలను రాజమౌళి ఆస్కార్ కోసం ఖర్చు చేయబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. సినిమాకు వచ్చిన లాభాల్లోంచి ఆ మొత్తం నిర్మాత ఇచ్చేందుకు ఓకే చెప్పాడట. సినిమా ఆస్కార్ బరిలో నిలవాలి… నామినేట్ అవ్వాలి అంటే ప్రపంచ వ్యాప్తంగా కచ్చితంగా గొప్ప పబ్లిసిటీ కావలసి ఉంది.

అందుకే సినిమాకు భారీ ఎత్తున పబ్లిసిటీ నిర్వహించేందుకు గాను రాజమౌళి ఇప్పటికే జపాన్​లో పర్యటిస్తున్నాడు. అక్కడ సినిమాను పెద్ద ఎత్తున ప్రమోట్ చేసేందుకు రెడీ అయ్యాడు. రేపు భారీ స్క్రీన్స్​లో జపాన్​లో విడుదల కానుంది. ఇక ఈ చిత్రంలో అగ్ర కథానాయకులు ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కలిసి నటించిన చిత్రమిది. అలియాభట్‌, అజయ్‌ దేవగణ్‌ కీలక పాత్రలు పోషించారు. డి.వి.వి.దానయ్య నిర్మించారు. ఈ ఏడాది ఆరంభంలో విడుదలై సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news