ఏపీలో పోలీసు ఉద్యోగార్థులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. త్వరలో 6,511 పోస్టుల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీలైనంత త్వరగా నోటిఫికేషన్ జారీ చేసి ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆదేశించారు సీఎం జగన్. ఆరువేలకుపైగా ఉద్యోగాల్లో ఆర్‌ఎస్‌ఐ ఉద్యోగాలు 96 ఉంటే… ఎస్‌ఐ సివిల్ ఉద్యోగాలు 315 ఉన్నాయి. ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఉద్యోగాలు 2520, సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగాలు 3580 ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నట్టు ప్రభుత్వ విడుదల చేసిన జీవోలో పేర్కొంది. జులైలోనే పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని సీఎం ఆదేశించారు. పోలీస్ శాఖపై నిర్వహించిన సమీక్షలో సీఎం జగన్ ఖాళీలు, రాష్ట్ర అవసరాలు, కొత్త జిల్లాల తర్వాత అవసరమైన అదనపు పోస్టుల భర్తీపై చర్చించారు.
ఖాళీలకు సంబంధించి పూర్తి నివేదిక ఇవ్వాల్సిందిగా ఉన్నతాధికారులను ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీస్ శాఖ సమాచారం సేకరించి రాష్ట్రంలో మొత్తం 26,431 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. దశలవారీగా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. తొలిదశలో 6,500 ఉద్యోగాలకు ఈ ఏడాదే నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. దీనికే ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మిగతా పోస్టులను దశలవారీగా భర్తీ చేస్తారు.