ప్రపంచంలో ఏ మతమూ, దేశమూ ఇవ్వనంత గౌరవం, మర్యాద, పూజనీయత కేవలం సనాతన ధర్మంలో మాత్రమే స్త్రీకి ఇవ్వబడింది. అసలు ఇంకా చెప్పాలంటే, పురుషునికన్నా స్త్రీనే ఒక మెట్టు ఎక్కువ అని ఎన్నోసార్లు చాటిచెప్పింది ఈ నా ధర్మం, నా దేశం, నాజాతి. అనాదియై, ఉన్నతమైన ఎన్నో భావాలు కలిగి ప్రపంచానికి, సంస్కారం నేర్పిన దేశం భారత దేశం .
స్త్రీ మూర్తి వివాహానంతరం భార్యాభర్త ఇద్దరూ సమం, అసలు ఆమెయే ఎక్కువ కూడా వేదాలు, శాస్త్రాలు, ప్రమాణ గ్రంథాలు అలానే చెప్పాయి. ఆమెయే గృహం, అందుకే ఆమె గృహిణి, ఆమె ఇంటిలో ఉంటున్నందుకు అతడు గృహస్థు. పెళ్ళి అయ్యీ అవ్వగానే, ఆ వ్యక్తికి సంబంధించిన సమస్తమునకూ ఆమె యజమానురాలు. అదీ మాజాతి. అందుకు భిన్నంగా స్త్రీని ఒక భోగ వస్తువుగా చూడడం, ఆనక వదిలేయడం అవైదికమూ, భారతీయతా కాని, అనాగరికులు సంస్కార హీనులైన అన్య జాతులు, పాఖండ మతస్తుతల సంప్రదాయం.
నిజానికి సనాతన ధర్మంలో, స్త్రీ లేకుండా ఏ మంగళమూ లేదు, మన దేశంలో స్త్రీ మూర్తిలేని ఇల్లు గబ్బిలాల కొంప వంటిదని అభిప్రాయం. ఇంట్లో కళ కళ లాడుతూ స్త్రీమూర్తి తిరుగుతూ దీపం పెట్టిన ఇల్లే దేవాలయం. ఆమెయే దేవత. స్త్రీలేకపోతే మగవానికి గౌరవమే లేదు. ఎంత గొప్పవాడైనా తన పక్కన భార్యగా స్త్రీలేకపోతే ఏ వైదిక కార్యక్రమమూ చేయలేడు. అసలు సనాతన ధర్మంలో ప్రవర్తిస్తున్న పురుషుడు ఏది చేసినా స్త్రీ గౌరవాన్ని ప్రకటించేదే అయ్యి వుంటుంది.