ఎక్కువ పనిగంటలు.. ఎక్కువ మరణాలు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనం.

-

ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల అధిక మరణాలు సంభవిస్తున్నాయని, ఆ మరణాలని కరోనా ఇంకా అధికం చేసిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడి చేసింది. జర్నల్ ఇన్విరాన్మెంట్ ఇంటర్నేషనల్ ప్రకారం 2016లో 7,45,000మంది మరణించారు. ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల వచ్చిన గుండె సంబంధిత వ్యాధులే దీనికి కారణం అని తెలిపారు. 2000సంవత్సరం నుండి పోలిస్తే ఇది 30శాతం పెరిగినట్లుగా ఉంది. ఒక వారంలో 55గంటల కంటే ఎక్కువ పనిచేయడం ఆరోగ్యానికి హానికరంగా మారుతుందని, ప్రపంచ ఆరోగ్య సంస్థకి చెందిన వాతావరణ, ఆరోగ్య డిపార్ట్ మెంట్ ఇన్ ఛార్జ్ మారియా నెయిరా తెలిపింది.

ఈ సమాచారం ప్రకారం పనిచేసే వారి పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని, భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని ఆమె తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, అంతర్జాతీయ కార్మిక సంస్థ సంయుక్తంగా ఇచ్చిన సమాచారం ప్రకారం మరణిస్తున్న వారిలో ఎక్కువ మంది పురుషులే ఉంటున్నారు. ఇంకా మధ్యవయస్కులు, వృద్ధులు ఉంటున్నారు. కొన్నిసార్లు ఈ మరణాలు చాలా రోజుల తర్వాత సంభవిస్తున్నాయని, పని చేసిన పదేళ్ళకు దీని ప్రభావం ఉంటుందని పేర్కొంది.

ఆగేయాసియా ప్రాంతాలు, పశ్చిమ పసిఫిక్ ప్రాంతాలు బాగా ప్రభావితం అయ్యాయని, అందులో చైనా, జపాన్, ఆస్ట్రేలియా ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. మొత్తం 194దేశాల సమాచారం తీసుకున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ, వారంలో 55గంటల కంటే ఎక్కువ పనిచేస్తున్న వారు, 30-45గంటలు పనిచేస్తున్న వారి కంటే 35శాతం అధిక రిస్కులో ఉన్నారని సూచించింది. ఈ సమాచారంలో 2000 నుండి 2016వరకు మాత్రమే తీసుకున్నారు. కరోనా కారణంగా ఇది మరింత పెరిగే అవకాశం ఉందని, మొత్తానికి ఎక్కువ పనిగంటలు చేయడం వల్ల 9శాతం మరణాలు ఎక్కువగా ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనం తెలుపుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news