యాదాద్రిలో కన్నులపండువగా ధ్వజారోహణం

-

తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన ప్రసిద్ధ దేవాలయం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం రోజున ఆలయంలో ధ్వజారోహణం, రాత్రి నిర్వహించిన దేవతాహ్వాన పర్వాలతో ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు రెండో రోజుకు చేరాయి. ఉత్సవాలను పురస్కరించుకొని యాదాద్రి వైభవాన్ని దశదిశలా చాటేలా కొండను విద్యుత్తు దీపాలతో అలంకరించారు.

లక్ష్మీదేవి సమేత యాదగిరీశుడిని ఆరాధిస్తూ విశేష పూజలు చేశారు. మహావిష్ణువు వాహనమైన గరుడ ఆళ్వారుడిని ఆవాహన చేసి, ప్రత్యేక పూజలు జరిపారు. లోక కల్యాణార్థం జరిగే స్వామి, అమ్మవార్ల తిరు కల్యాణ మహోత్సవానికి ముల్లోకాల దేవతలను ఆహ్వానించే బాధ్యతలను గరుడ ఆళ్వారుడికి అప్పజెప్పే తతంగాన్ని యాజ్ఞీకులు, పూజారులు చేపట్టారు.

రాత్రివేళ భేరీపూజ చేపట్టి, దేవతలను ఆహ్వానించే పర్వాన్ని అష్టరాగాలు, భేరీ శబ్దాల మధ్య నిర్వహించారు. ఈవో గీత, ధర్మకర్త నరసింహమూర్తి ఏర్పాట్లను పర్యవేక్షించారు. వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news