ఏపిలో పరిణామాలపై గవర్నర్ ఉపేక్షించరాదని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కోరారు. తక్షణమే రాష్ట్ర గవర్నర్ జోక్యం చేసుకోవాలన్నా ఆయన ఆర్టికల్ 243ఏ, ఆర్టికల్ 243కె(1) ప్రకారం ఎన్నికల నిర్వహణ అధికారం ఎలక్షన్ కమిషన్ దేనని అన్నారు. పంచాయితీ ఎన్నికలకు కావాల్సిన ఉద్యోగులను కేటాయించేలా చూడాల్సింది గవర్నరేనని ఆయన అన్నారు . రాజ్యాంగంలోని ఆర్టికల్ 243కె(3) ఇదేచెబుతోందని అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు ఆర్టికల్ 356ను అట్రాక్ట్ చేసేలా ఉన్నాయని, ఎన్నికల నిర్వహణకు సహకరించేది లేదని మంత్రులు చెప్పడం దేశచరిత్రలో లేదని అన్నారు. ఎన్నికలకు సహకరించమని ఉద్యోగ సంఘాల నేతలు చెప్పడం ఏ రాష్ట్రంలోనూ లేదని ఆయన అన్నారు.
మద్యం క్యూల నిర్వహణకు లేని అభ్యంతరాలు, పంచాయితీ ఎన్నికలకు ఉంటాయా..? అని ఆయన ప్రశ్నించారు. కోవిడ్ ప్రభావం ఉందని 2022జూన్ దాకా స్థానిక ఎన్నికలు జరపరా..? అని యనమల ప్రశ్నించారు. ప్రతిపక్షాలపై దాడులు, అన్నివర్గాల ప్రజలపై దౌర్జన్యాలు, చివరికి ఆలయాల ధ్వంసాల కారణంగా ప్రజల్లో ఆగ్రహం చూసే ఎన్నికల నిర్వహణకు సిఎం జగన్ రెడ్డి ఆటంకాలు సృష్టిస్తున్నాడని ఆయన అన్నారు. స్థానిక ఎన్నికలు ఎదుర్కొనే ధైర్యం జగన్ రెడ్డి అండ్ కో కు లేకనే ఈ జగన్నాటకం అని అన్నారు. వైసీపీ ప్రభుత్వ రాజ్యాంగ ధ్వంసం(కానిస్టిట్యూషన్ బ్రేక్ డౌన్)ను అడ్డుకోవాలని ఆయన డిమాండ్ చేశారు .