ఆంధ్రప్రదేశ్ ను మరో శ్రీలంక కాకుండా కాపాడుకోవలసిన అవసరం ఉందని అన్నారు చంద్రబాబు నాయుడు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ చేపట్టిన ‘బాదుడే బాదుడు ‘ నిరసన కార్యక్రమంలో భాగంగా.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో కుప్పం లోని శాంతిపురం మండలానికి చేరుకున్న ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు. నాడు రావణుడు చేసిన తప్పుకు లంకాదహనం అయిందని చెప్పిన ఆయన.. జనం మేలుకోకపోతే వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని మరో శ్రీలంక చేస్తోందని విమర్శించారు.
గడప గడపకు వచ్చే ప్రతి వైసిపి ప్రజాప్రతినిధులను అన్ని సమస్యలపై నిలదీయండి ప్రజలను కోరారు. ఆదర్శ నియోజకవర్గమైన కుప్పం లోనూ ధన రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. వెయ్యి రూపాయలు ఇచ్చి లక్ష దోచేస్తున్నారు అని అన్నారు చంద్రబాబు. సంక్షేమం పేరుతో చేపలకు ఎర వేసినట్లు.. జగన్ ప్రజలకు ఏర వేస్తున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. శిశుపాలుడు వంద తప్పులు చేసినట్లు జగన్ కూడా తప్పుల మీద తప్పులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టడం జగన్ చివరి తప్పు అవుతుందని.. మీటర్లు పెట్టకుండా రైతులు ఎదురు తిరగాలి అని పిలుపునిచ్చారు చంద్రబాబు.