ఆ నాలుగు నియోజకవర్గాల్లో వైసీపీ వర్గపోరు శృతిమించినట్లుందే

-

ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడలేవ్‌. ఆ నియోజకవర్గాలలోనూ అదే జరుగుతోంది. నిత్యం గొడవలే. ఆధిపత్య పోరుతో రచ్చ రచ్చ చేసుకుంటున్నారు. స్వపక్షంల విపక్షంగా మారిపోయారు నాయకులు. తరచూ పార్టీకి తలపోటులు తీసుకొస్తున్నారు.

విజయవాడ తూర్పు… దర్శి.. నందికొట్కూరు..గన్నవరం ఈ మధ్యకాలంలో వైసీపీ వర్గాలలో జరుగుతున్న గొడవలతో ఈ నియోజకవర్గాలు నిత్యం చర్చల్లో ఉంటున్నాయి. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీకి జై కొట్టిన నాటి నుంచి ఇక్కడున్న యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావులతో పడటం లేదు. పాత, కొత్త నేతల మధ్య అస్సలు పొసగడం లేదు. లేటెస్ట్‌గా ఎమ్మెల్యే వంశీకి చెందిన వర్గంలోని వారే రెండు గ్రూపులుగా విడిపోయి రోడ్డుపై కొట్టుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ సమస్యను ఎలా కొలిక్కి తీసుకురావాలా అని అనేక వడపోతలు చేస్తున్నారు పార్టీ నేతలు.

విజయవాడ తూర్పులోనూ సీఎం జగన్‌ పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వైసీపీ వర్గాల మధ్య పెద్ద రచ్చకే దారితీసింది. ఇక్కడ నియోజకవర్గ ఇంఛార్జ్‌గా దేవినేని అవినాష్‌ ఉన్నారు. నిమ్మల జ్యోతిక వర్గం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో అవినాష్‌ ఫోటో పెట్టకపోవడంతో వాటిని చించేశారు. అవినాష్‌ వర్గంలోని పుప్పాల కుమారి వర్గం గొడవకు దిగడంతో పంచాయితీ పోలీస్‌స్టేషన్‌కు చేరింది.

ప్రకాశం జిల్లా దర్శిలోనూ అధికార పార్టీ రాజకీయం హీటెక్కిస్తూనే ఉంది. ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి మధ్య విభేదాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. ఇప్పుడు ఒకరినొకరు డైరెక్ట్‌గా సవాళ్లు, విమర్శలు చేసుకునే వరకు గొడవలు చేరుకున్నాయి. అవకాశం చిక్కితే బలప్రదర్శనకు దిగుతున్నారు నాయకులు. సీఎం జగన్‌ పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బూచేపల్లిపై ఫైర్‌ అయ్యారు ఎమ్మెల్యే మద్దిశెట్టి. సాఫ్ట్‌వేరోడే కదా.. సాఫ్ట్‌గా ఉంటానని అనుకున్నారని కానీ.. వెనక బండరాయి అంత గుండె ఉందని కామెంట్స్‌ చేశారు మద్దిశెట్టి. అయితే తాను చేయని పదవి లేదని .. సీఎం జగన్‌ ఎవరికి సపోర్ట్‌ చేయమంటే వారికి చేస్తానని బదులిచ్చారు బూచేపల్లి.

కర్నూలు జిల్లా నందికొట్కూరు సమస్య కూడా పార్టీకి తలనొప్పిగానే ఉందట. ఇక్కడ ఎమ్మెల్యే ఆర్థర్‌కు, వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డకి మధ్య అస్సలు పడటం లేదు. ముందు నుంచీ రెండు వర్గాలుగా ఉంది ఇక్కడి పరిస్థితి. రోజుకో పంచాయితీ పార్టీ ఇంఛార్జుల దగ్గరకు చేరుతోంది. ఆధిపత్య పోరుతో ఎవరికి దగ్గరకు వెళ్లితే ఏమౌతుందో తెలియని పరిస్థితి పార్టీ శ్రేణులది. ఒకానొక దశలో రాజీనామాకు కూడా సిద్ధపడి అధికారపార్టీలో కలకలం రేపారు ఎమ్మెల్యే ఆర్థర్‌. అయితే తన ఎదుగుదలను చూసి ఓర్వేలేకే ఆరోపణలు చేస్తున్నారన్నది బైరెడ్డి వాదన. నిత్యం ఏదో ఒక అంశంపై రెండు వర్గాలు తగువులాడుకోవడం ఇక్కడ మామూలైపోయింది.

ఇలా.. కీలక నియోజకవర్గాలలో పార్టీ నేతలు సయోధ్యను వీడి కుస్తీ పట్టడం తలనొప్పిగా మారిందట. మరి.. వీటిని పార్టీ పెద్దలు పరిష్కరిస్తారో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news