జగన్ బాధ పట్టించుకోండయ్యా ?

-

ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు, కష్టాలు, నష్టాలు, అవమానాలు, హేళనలు, వెన్నుపోట్లు ఇలా ఎన్నిటినో ఎదుర్కొని మరి, పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు జగన్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. చివరకు జైలు జీవితం అనుభవించినా జగన్ పెద్దగా బాధపడింది లేదు. ఏపీలో బలమైన పునాదులు వేసుకున్న తెలుగుదేశం పార్టీని దాదాపుగా కూకటివేళ్ళతో సహా పెకిలించినంత పని చేశారు జగన్.  తెలుగుదేశం పార్టీని ఘోరాతి ఘోరంగా ఓడించి మరి వైసీపీని విజయం వైపు విజయవంతంగా నడిపించి జగన్ అధికారంలోకి వచ్చారు. ప్రజల్లో మరింతగా మంచి పేరు తెచ్చుకునేందుకు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, నిరంతరం ప్రజా సంక్షేమం పైనే దృష్టి పెట్టి పని చేస్తున్నారు.

ఈ క్రమంలో పార్టీ వ్యవహారాలపై పూర్తిస్థాయిలో జగన్ దృష్టి పెట్టలేకపోతున్నారు. దీన్ని అధిగమించేందుకు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, వై వి సుబ్బారెడ్డి లకు ఉత్తరాంధ్ర, కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలను అప్పగించారు. ఇదిలా ఉంటే కొంతకాలంగా వైసీపీలో గ్రూపు రాజకీయాలు పెరిగిపోతున్నాయి. ఎక్కడికక్కడ నాయకుల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. పార్టీలోనూ, నియోజకవర్గ స్థాయిలో ను తమ మాటే నెగ్గాలి అనే విధంగా నాయకులు వ్యవహరిస్తూ, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ, సొంత పార్టీ పరువు వీధిన పడేస్తున్నారు. వీరి సంగతి ఇలా ఉందనుకుంటే, టిడిపి నుంచి వైసీపీలోకి పెద్ద ఎత్తున వచ్చి చేరిన నాయకులతో ఇప్పుడు ఎదుర్కొంటున్న ఇబ్బంది అంతా ఇంతా కాదు.

వారు పార్టీలో చేరిన సమయంలో పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ సముచిత స్థానం కల్పిస్తామని, అనేక పదవులు అప్పగిస్తామని ఎన్నో హామీలు ఇచ్చి మరీ తీసుకువచ్చారు. కొంతమంది పార్టీలోకి వచ్చి చేరారు కానీ, నియోజకవర్గస్థాయిలో పరిస్థితి వేరే రకంగా ఉంది. ఇతర పార్టీల నుంచి వైసీపీలో చేరిన నాయకులను కలుపుకుని వెళ్లేందుకు మొదటి నుంచి వైసీపీ ని అంటిపెట్టుకుని ఉన్న నాయకులు ఎవరూ ఇష్టపడకపోవడం, వారికి పార్టీలో ప్రాధాన్యత పెరిగితే, తమ ప్రాధాన్యత తగ్గిపోతుందనే అభిప్రాయంతో వారిని పక్కన పెడుతూ వస్తుండడం , ఈ పరిణామాలతో కొద్ది రోజులు వాతావరణం వేడెక్కింది. మొన్నటి వరకు అంతర్గతంగా నేతల మధ్య ఆధిపత్య పోరు నడిచినా,ఇప్పుడు రోడ్లపైకి వచ్చి మరి కొట్టుకునే స్థాయికి వెళ్లి పోయింది.

ఈ వ్యవహారాలు జగన్ కు పెద్ద తలనొప్పిగా మారాయి. నాయకుల మధ్య సమన్వయం చేసేందుకు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా, ఎవరు లెక్క చేయడం లేదని, ఎన్నిసార్లు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వాళ్లకు వార్నింగులు ఇస్తున్న, మళ్లీ యధావిధిగా గ్రూపు రాజకీయాలతో పార్టీ పరువు తీస్తున్నారు అని ఆవేదన చెందుతున్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా, ఏపీలో చాలా నియోజకవర్గాల్లో నాయకుల మధ్య సమన్వయ లోపం చాలా స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా చీరాల, గన్నవరం నియోజకవర్గంలో నాయకులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేంత వరకు పరిస్థితి వెళ్లడంతో, జగన్ ఈ వ్యవహారాలపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. తాను ప్రభుత్వ వ్యవహారాల్లో బిజీగా ఉంటే, సొంత పార్టీ నాయకులు ఇప్పుడు పార్టీని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని జగన్ సీరియస్ అవుతున్నట్లు తెలుస్తోంది.

ఎవరు ఎన్ని చేసినా, నియోజకవర్గాల్లో మాత్రం పరిస్థితి అదుపు తప్పి నట్టుగానే కనిపిస్తోంది. జగన్ మాటలు సైతం పట్టించుకోనట్టు గానే, ఆధిపత్యం కోసం నాయకులు ఒకరిపై ఒకరు బురద చల్లుకుంటూ పార్టీ పరువును తీస్తున్నారనే అభిప్రాయం అందరిలోనూ కలుగుతోంది.

-Surya

Read more RELATED
Recommended to you

Latest news