ఏపీలో అధికారంలో తమ పార్టీ ఉండగా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే నిరాహార దీక్షకు దిగడం సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే రాజమండ్రి ఇంటర్నేషనల్ పేపర్ మిల్లులో కాంట్రాక్ట్ కార్మికులకు మద్దతుగా యాజమాన్యంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. 194 మంది కాంట్రాక్టు ఉద్యోగులను గత సంవత్సరం రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పడంతో పేపర్ మిల్ యాజమాన్యాన్ని ఎమ్మెల్యే రాజా ప్రశ్నించారు.
అయితే పేపర్ మిల్ యాజమాన్యం స్పందించక పోవడంతో పేపర్ మిల్ ప్రాంగణంలోనే ఎమ్మెల్యే దీక్షకు దిగారు. డిమాండ్ పరిష్కారం అయ్యే వరకు ఆమరణ దీక్షను చేపడుతున్నట్లు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ప్రకటించారు. సీనియారిటీ ప్రకారం పేపరు మిల్లులోని కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేతో పాటు సిపిఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్ కూడా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఎమ్మెల్యే దీక్షకు మద్దతుగా వైసిపి నాయకులు ఆందోళనకు దిగారు. పేపరు మిల్లులో కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కారించాలని నినాదాలు చేశారు.