కొత్త అధ్యక్షులు వచ్చారు ఇక జిల్లాలో పార్టీకి తిరుగులేదనుకున్నారు. కానీ సాక్షత్తు పార్టీ అధ్యక్షులు చంద్రబాబు పిలుపునిచ్చినా ఏమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారట విజయనగం తెలుగు తమ్ముళ్లు. టీడీపీ నుంచి కేంద్రమంత్రులుగా.. రాష్ట్ర మంత్రులుగా పనిచేసిన సీనియర్ నాయకులు ఉన్న జిల్లా విజయనగరం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో జిల్లాలో పార్టీ పరిస్థితే మారిపోయింది.
మాన్సాస్ ట్రస్ట్ నుంచి అశోక్‌గజపతి రాజును తొలగించడంతో… ఆ సమస్యతో పోరాటం చేయడానికే విజయనగరం రాజావారికి సమయం సరిపోవడం లేదు. గత ప్రభుత్వంలో మంత్రలుగా చేసిన కిమిడి మృణాళిని, సుజయకృష్ణరంగారావులు సైతం ఏమైపోయారో ఎవరికీ తెలియడం లేదు. ప్రస్తుతం విజయనగరం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడిగా మృణాళిని కుమారుడు కిమిడి నాగార్జునకే బాధ్యతలు అప్పగించారు. అయినా జిల్లాలో పార్టీ పరిస్థితి మారలేదట. నాగార్జున సైతం విశాఖకే పరిమితమయ్యారట.
అరకు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షురాలు సంధ్యారాణి సైతం పార్టీ కార్యక్రమాలను పట్టించుకోవడం లేదట. ఆ మధ్య అమరావతి ఉద్యమం 300 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని టీడీపీ శ్రేణులను చంద్రబాబు ఆదేశించారు. అయినా జిల్లాలో ఏ ఒక్క సీనియర్ కనీసం రోడెక్కలేదు. అధికారంలో ఉన్నప్పుడు అయినదానికీ.. కానిదానికీ హాజరైన పార్టీ నాయకులు… ఇప్పుడు చంద్రబాబు చెప్పినా తమకేం సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తున్నారట. పార్టీ కొత్త వారికి బాధ్యతలు అప్పగించినా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో కేడర్ సైతం డీలా పడుతోందట. ఈ సమస్యను టీడీపీ అధినేత ఎలా పరిష్కరిస్తారో చూడాలి.