విశాఖలో టీడీపీని కలవర పెడుతున్న వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్

-

గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పీఠమే లక్ష్యంగా వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్‌కు తెర తీసింది. టీడీపీ అభ్యర్ధులు, ముఖ్య నేతలకు కండువాలు కప్పేస్తోంది. అత్యధిక స్థానాలు గెలిపించుకోవడమే లక్ష్యంగా అధికారపార్టీ వ్యూహం ఇప్పుడు టీడీపీని కలవరపెడుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వివాదం నేపథ్యంలో జీవీఎంసీ ఎన్నికల తీర్పు పై సర్వత్ర ఆసక్తి నెలకొంది.

ఏపీలో అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ విశాఖ. 98 డివిజన్లు. 22లక్షల మంది జనాభా కలిగిన జీవీఎంసీ అనేక ప్రత్యేకతలు కలిగి ఉంటుంది. అంతే కాదు ఇప్పుడు ఏపీకి ఎగ్జిగ్యూటీవ్‌ క్యాపిటల్‌. దీంతో రాజకీయంగా విశాఖ మేయర్ పీఠం ప్రధాన పార్టీలకు అత్యంత కీలకంగా మారింది. దాదాపు 9 ఏళ్ల విరామం తర్వాత గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ కార్పోరేషన్లో మెజార్టీ స్ధానాలను దక్కించుకోవడం ప్రతిష్టాత్మకంగా మారింది.

అదే సమయంలో ఇక్కడ ప్రతిపక్ష టీడీపీ బలంగా వుంది. గత ఎన్నికల్లో విశాఖలో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచారు. గెలిచిన ఎమ్మెల్యేలంతా రాజకీయంగా బలమైన వారే కావడం అధికార వైసీపీకి ఇబ్బందికరంగా మారింది. ఈనేపథ్యంలో వలసలపై అధికార పార్టీ దృష్టి పెట్టింది. టీడీపీని బలహీన పరచడమే లక్ష్యంగా తెలుగు దేశం, ఇతర పార్టీల్లోని బలమైన నాయకులు, వారి అనుచరులను గుర్తించి ఆహ్వానిస్తోంది. తాజాగా టీడీపీ కార్పోరేటర్ అభ్యర్ధి పాకలపాటి అప్పల నర్సింహరాజుతో పాటు మరికొంత మంది నేతలు విజయసాయిరెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పేసుకున్నారు.

ఒకటి రెండు రో జుల్లో మరికొంత మంది టీడీపీ ముఖ్యులు పార్టీని వదిలేయడానికి సిద్ధం అవుతున్నారు. అయితే అధికారపార్టీ ఎత్తుగడలు టీడీపీని కలవరపరుస్తున్నాయి. కార్పోరేటర్ అభ్యర్ధులు, సీనియర్ నాయకులను ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ప్రతిపక్షం ఆరోపిస్తుంది. ఉత్తరాది ఓటర్ల ప్రభావం కూడా జీవీఎంలో ఎక్కువగా ఉండటంతో బీజేపీ,జనసేనలు తమ ఉనికి చాటుకునేందుకు పోరాడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news