స్థానిక ఎన్నికల్లో దుమ్ము రేపిన వైసీపీ..మున్సిపోల్స్ లోనూ ఇవే ఫలితాలు ఖాయమా..?

-

ఏపీ స్థానిక ఎన్నికలు వైసీపీ క్యాడర్ కు ఫుల్ జోష్ ఇచ్చాయి. 80 శాతం పైగా విజయాలతో అధికార పార్టీ దుమ్ము రేపింది. జగన్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందనే విమర్శకుల నోళ్లకు తాళం పడేలా ఫలితాలు రావడంతో.. వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ప‌ల్లెపై త‌న ప‌ట్టు ఎంత బ‌లంగా ఉందో పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో అధికార పార్టీ మ‌రోమారు చాటి చెప్పింది. పంచాయతీ ఎన్నికల ఫలితాలే మున్సిపల్ ఎన్నికల్లో పునరావృతమౌతాయని వైసీపీ నేతలు నమ్మకంగా ఉన్నారు.


వైసీపీ ఏక‌ప‌క్ష విజ‌యాలు గ్రామీణ ప్రాంతాల్లో వైఎస్ జ‌గ‌న్ సంక్షేమ ప‌థ‌కాలు ఎంత బ‌లంగా ప్రజాద‌ర‌ణ పొందాయో చాటుతున్నాయి. పేరుకు పార్టీ ర‌హితంగా జ‌రుగుతున్న ఎన్నిక‌లే అయినా.. ప్రధాన పార్టీలు బ‌ల‌ప‌రుస్తున్న అభ్యర్థులే బ‌రిలో నిలిచారు. దీంతో అధికార‌, ప్రతిప‌క్ష పార్టీల‌పై ఆద‌రాభిమానాలు ఈ ఎన్నిక‌ల‌పై ప్రభావం చూపుతున్నాయి. ఈ ఎన్నికల ద్వారా క్లారిటీ వచ్చిన మరో విషయం ఏంటంటే.. టీడీపీకి స్థానికంగా అభ్యర్థులే లేకపోవడం. దాదాపుగా అన్ని జిల్లాల్లో ఏకగ్రీవాలు మినహా మిగతా చోట్ల జరిగిన పోరాటం అంతా వైసీపీ వర్సెస్ వైసీపీ. పార్టీపై స్థానికంగా పట్టు నిలుపుకునేందుకు రెండు వర్గాలు తమ బలప్రదర్శన చేశాయంతే. ఈ బలప్రదర్శనల్లో టీడీపీ కేవలం ప్రేక్షక పాత్రకే పరిమితమైంది.

పంచాయతీల్లోనే ఇలా ఉంటే.. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైన మున్సిపోల్స్ లోనూ వైసీపీ ఘన విజయానికి అడ్డే ఉండదనేది ఆ పార్టీ నేతల అభిప్రాయం. 2019 ఎన్నికల్లో వైసీపీ తిరుగులేని మెజార్టీతో అధికారం దక్కించుకుంది. 151 ఎమ్మెల్యే సీట్లు, 22 ఎంపీ సీట్లు గెలుచుకుంది. అయినా సరే క్యాడర్ ఉందా.. లేదా అనే అనుమానం వ్యక్తం చేసేవాళ్లు విమర్శకులు. ప్రజల్లో వైఎస్ కు ఉన్న పేరు ప్రతిష్ఠలు, జగన్ పాదయాత్ర, ప్రజాకర్షక పథకాలతోనే వైసీపీ గద్దె నెక్కిందనే వ్యాఖ్యానాలు వినిపించాయి. కానీ ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో సత్తా చాటడంతో.. వైసీపీ క్యాడర్ క్షేత్రస్థాయిలో బాగా బలపడింది. ఇప్పటిదాకా లీడర్ బేస్ట్ పార్టీగా ఉన్న వైసీపీ.. క్యాడర్ బేస్ట్ పార్టీగా రూపాంతరం చెందింది.

ప్రాంతీయ పార్టీల మనుగడకు ఎప్పుడైనా క్యాడరే కీలకం. ప్రజాకర్షక పథకాలు, భావోద్వేగాలు ఎక్కువ కాలం ఉండవు. పార్టీని కలకాలం నిలబెట్టేది విశ్వసనీయమైన పార్టీ క్యాడరే. గతంలో టీడీపీకి ఇలాంటి బలమైన క్యాడర్ ఉండేది. ఇప్పుడు స్థానిక ఎన్నికల ఫలితాలతో వైసీపీ కూడా క్షేత్రస్థాయిలో బాగా బలపడిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే వలంటీర్ల ద్వారా గ్రౌండ్ లెవల్లో ప్రజలు ఏమనుకుంటున్నారనే విషయం ప్రభుత్వానికి తెలుస్తోంది. ఇప్పుడు పంచాయతీ, భవిష్యత్తులో మండల, జిల్లా స్థాయిలో కూడా అధికార పార్టీ ప్రజాప్రతినిధులుంటే.. వైసీపీ మరింత బలపడడం ఖాయం.

స్థానిక ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తే.. వీలైనంత ఎక్కువ మంది కార్యకర్తలకు పదవులిచ్చి.. వాళ్లలో ఉన్న అసంతృప్తి కూడా పోతుంది. ఇప్పుడు 80 శాతానికి పైగా స్థానాల్లో వైసీపీ విజయం సాధించడంతో.. ఆ మేరకు క్యాడర్ కు పదవులు వచ్చినట్టే. అధికారంలోకి వచ్చి రెండేళ్లైనా.. తమకు ఒరిగిందేమీ లేదనే నిరాశలో ఉన్న కొంత మంది క్యాడర్ కు.. స్థానిక ఎన్నికలతో కిక్ వచ్చినట్టైంది. భారీ విజయాలు వైసీపీ అగ్రనేతలకు సంతోషాన్నిచ్చాయి. చాలా మంది కార్యకర్తలకు పదవులు దక్కడంతో.. ఇక తమ దగ్గరకు వచ్చే పంచాయతీలు కూడా తగ్గుతాయని భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే రాష్ట్రవ్యాప్తంగా వైసీపీకి సానుకూల వాతావరణం కనిపించడం అధికార పార్టీకి కొత్త ఉత్సాహాన్నిచ్చింది. ప్రభుత్వం వచ్చి రెండేళ్లైనా.. ప్రజల్లో జగన్ పై మోజు తగ్గలేదని ఫలితాలు నిరూపించాయని వైసీపీ చెబుతోంది.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉండగా.. వైసీపీ ఘన విజయాలు సాధించలేదనే అపోహలు మొదట్లో ఉన్నాయి. కానీ ఎన్నికల ఫలితాలతో అవన్నీ పటాపంచలయ్యాయి. మొన్నటివరకూ జగన్ పథకాలపై అనుమానాలు వ్యక్తం చేసిన విపక్షాలు కూడా ఇప్పుడు సైలంటయ్యాయి. జగన్ పథకాల ప్రకటనలకే పరిమితమౌతున్నారని, డెలివరీ మెకానిజం సరిగ్గా లేదనే విమర్శలు నిజం కాదని తేలిపోయింది.మాజీ సీఎం చంద్రబాబు సొంత నియోజవర్గం దగ్గర్నుంచీ.. పలువురు టీడీపీ సీనియర్ల కంచుకోటల్లోనూ వైసీపీ జెండా ఎగరడంతో.. ఆ పార్టీ శ్రేణులు పండగ చేసుకుంటున్నాయి. స్థానిక ఎన్నికలే కదా అని వైసీపీ లైట్ తీస్కోలేదు. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలకు బాధ్యతలు ఇవ్వడంతో పాటు.. జిల్లాలకు ఇంఛార్జ్ మంత్రుల్ని కూడా నియమించింది.

స్థానిక ఎన్నికలకు కనీవినీ ఎరుగని రీతిలో వైసీపీ వ్యూహాలు రచించింది. గ్రామస్థాయి ఎన్నికలపై అగ్రనేతలు ఇంత ఫోకస్ పెట్టడం ఎప్పుడూ చూడలేదనే కామెంట్లు వినిపించాయంటే.. పంచాయతీ ఎన్నికల్ని వైసీపీ ఎంత సీరియస్ గా తీసుకుందో అర్ధమవుతోంది. ఏపీలో కొత్త తరహా రాజకీయాన్ని ప్రజలకు పరిచయం చేయాలని, అందుకు పంచాయతీ ఎన్నికల ఫలితాలే నాంది కావాలనే బలమైన సంకల్పం వైసీపీలో కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news