కొత్త మలుపు తిరిగిన చీరాల వైసీపీ వార్

-

చీరాల వైసీపీ వార్‌ కొత్త మలుపు తిరుగుతోంది. మొన్నటి వరకు కరణం వర్సెస్‌ ఆమంచిగా ఉన్న ఎపిసోడ్‌లోకి ఇప్పుడు కొత్తగా పోతుల సునీత ఎంటరయ్యారు. కరణం పై ఆమె దండయాత్ర మొదలుపెట్టడంతో రాజకీయం మళ్లీ హీటెక్కింది. ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా చీరాల అధికార పార్టీలో నేతల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి.

చీరాల ఎమ్మెల్యే కరణం బలరామ్, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ లు గత కొంత కాలంగా ఉప్పునిప్పుగా ఉంటున్నారు. గత ప్రభుత్వంలో కలిసి పని చేసిన నేతలు ఇద్దరూ ప్రస్తుతం అధికార వైసీపీలో మాత్రం ఎడమోహం పెడమోహంగా ఉంటున్నారు. ఇద్దరు నేతలు చీరాలలో అధికార పెత్తనానికి ఎవరికివారే పావులు కదుపుతున్నారు. దీంతో ఏ చిన్న కార్యక్రమమైనా గొడవతోనే ముగుస్తోంది. ఇటు పోలీసులకు కూడా తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఒక వర్గం పై మరొక వర్గం దాడులు చేయడంతో గత కొంత కాలంగా ఉద్రిక్త పరిస్థితులు చీరాలలో కామన్‌ అయిపోయాయి.

వీళ్లిద్దరికీ సర్ది చెప్పడం హైకమాండ్‌కు కష్టంగా మారిందని అనుకుంటున్నవేళ నేనేం తక్కువ తినలేదని మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీత ఎంటరయ్యారు. అక్కాయపాలెంలో కరణం బలరాం ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇందులో మాజీ మంత్రి పాలేటి రామారావుతో పాటు పోతుల సునీత పాల్గొన్నారు. అయితే ఇద్దరు నేతలతో ఎడమొహం పెడమొహం అన్నట్టు వ్యవహరించారు. పరిస్థితి ఇలా ఉండగా… పాలేటి… ఇదే స్టేజ్‌ మీద కరణంకు అనుకూలంగా మాట్లాడారు. 2024లో కరణం బలరామ్‌ను ఎమ్మెల్యేగా మరోసారి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

అసలే చీరాల నుంచి పోటీ చేయాలని భావించి భంగపడ్డ పోతుల సునీత… పాలేటి మాటల్ని జీర్ణించుకోలేకపోయారు. వెంటనే లేచి… ఇళ్ల స్థలాల వేదికపై రాజకీయాలేంటని అడ్డుపడడంతో ఇద్దరి మధ్యా వాగ్వాదం నడిచింది. గతంలో తాను పోటీ చేసిన సమయంలో ఎవరూ మద్దతు ఇవ్వలేదని కడుపు చించుకున్నారామె.

మొన్నటి వరకు కరణం బలరామ్ వెంట తిరిగిన పోతుల సునీత…ఒక్కసారిగా రివర్స్ కావడం వైసీపీలో హాట్ టాపిక్‌గా మారింది. వీరు ముగ్గురి మధ్యా సఖ్యత ఉన్నా.. ఒక్కసారిగా ఎందుకు ఇలా జరిగిందని ఇటు విపక్షంలోనూ చర్చ సాగుతోంది. మొత్తానికి ఈ కొత్త గొడవ ఎంతవరకు తీసుకెళ్తుందోనని గుసగుసలాడుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news