బెంగళూరు: అధికార పక్షంలో కీలక పరిణామాలు చేటు చేసుకున్నాయి. సీఎం పదవికి యడియూరప్ప రాజీనామా చేశారు. రాజీనామా లేఖను యడియూరప్ప రాజ్ భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు సమర్పించారు. ఈ మేరకు యడియూరప్ప రాజీనామాను గవర్నర్ ఆమోదం తెలిపారు. దీంతో తదుపరి సీఎంపై బీజేపీ అధిష్టానం దృష్టి సారించింది. ముగ్గురు పేర్లను పరిశీలిస్తోంది. పార్లమెంట్ ఆవరణలో అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమావేశం నిర్వహించారు. కర్ణాటక బెంగళూరు కొత్త సీఎంపై చర్చించారు. అయితే లింగాయత్ వర్గానికి చెందిన మురుగేష్ నిరానీ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఈ సాయంత్రానికి పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.
యడియూరప్ప రాజీనామాకు ముందు ఆయన రెండేళ్ల పాలనపై వేడుక నిర్వహించారు. ఈ వేడుకలో యడియూరప్ప కంటతడి పెట్టారు. ఈ సందర్భంగా యడియూరప్ప మాట్లాడుతూ రెండేళ్లు ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపానని చెప్పారు. రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నానన్నారు. తాను ప్రజల కోసం పని చేశానని వ్యాఖ్యానించారు. తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేశానని పేర్కొన్నారు. పోరాటంలో ఒంటరినై పోయానని బాధపడలేదన్నారు. గవర్నర్‌ను కలిసి రాజీనామా లేఖ అందజేస్తానని యడియూరప్ప తెలిపారు