భారత దేశంలో ప్రతీ ఏటా టీబీ కారణంగా 4.5లక్షల మంది చనిపోతున్నారు. అంటే రోజుకి 1400మంది చనిపోతున్నారన్న మాట. ప్రతీ మూడు నిమిషాలకి ఇద్దరు చనిపోతున్నట్లు లెక్క. 2019లెక్కల ప్రకారం భారతదేశంలో టీబీతో బాధపడుతున్నవారు 24.04లక్షల మంది ఉన్నారు. 2018సంవత్సరంతో పోలిస్తే 14శాతం పెరిగినట్టు లెక్క. అంటే రోజు రోజుకీ టీబీ వ్యాధిగ్రస్తులు ఎంతగా పెరుగుతున్నారో అర్థం చేసుకోవచ్చు.
ఐతే టీబీ పట్ల చాలా మందికి చాలా అపోహలున్నాయి. అవేంటో తెలుసుకుని నిజాలేంటో చూద్దాం.
అపోహ 1: టీబీ వారసత్వంగా వస్తుంది.
నిజమేంటంటే, ఇది వారసత్వంగా రాదు. టీబీ వ్యాధిగ్రస్తుడితో కలిసి మెలిసి మరీ క్లోజ్ గా ఉన్నట్లయితే అక్కడ నుండి ఆ వ్యాధికారకాలు ఇతరులకి వ్యాపించే అవకాశం ఉంటుంది.
అపోహ2: టీబీ వ్యాధిగ్రస్తులు తుమ్మినా అది ఇతరులకు అంటుతుంది.
ఇది వందశాతం నిజం కాదు. ఎప్పుడో ఒకసారి టీబీ వ్యాధిగ్రస్తులతో మెలిగినంత మాత్రాన అది అంటదు. మరీ ఎక్కువ రోజులో, ఎక్కువ గంటలో కలిసి ఉండడం వల్ల వ్యాపించే అవకాశం ఉంటుంది.
అపోహ3: ఎక్కువ పొగ తాగితే టీబీ వస్తుంది
ట్యూబరుక్యులోసిస్ అనే బాక్టీరియా వల్ల వచ్చే ఈ వ్యాధి పొగ తాగితేనే వస్తుందనడంలో నిజం లేదు. కాకపోతే పొగ తాగేవారికి వచ్చే అవకాశం ఎక్కువ. ఈ బాక్టీరియా మనలో పెరగడానికి పొగ తాగడం ఎక్కువ దోహదపడుతుంది.
అపోహ4: టీబీ కేవలం ఊపిరితిత్తులనే ప్రభావితం చేస్తుంది.
ఇది నిజం కాదు. టీబీ కారణంగా ముఖ్యంగా ప్రభావితం అయ్యేవి ఊపిరితిత్తులే అయినప్పటికీ లింఫ్ గ్రంధులు కూడా ఎఫెక్ట్ అవుతుంటాయి.
అపోహ6: టీబీ నయం కాదు
ఇది అక్షరాల అసత్యం. సరైన చికిత్స జరిపి, మందులు వాడితే టీబీని నయం చేయవచ్చు.